
పైరసీ అనేది సినిమా ఇండస్ట్రీని రోజురోజుకు కుంగదీస్తున్న ఒక శాపం. కొంతమంది నిర్మాతలు కష్టపడి సంపాదించిన డబ్బును రిస్క్ తీసుకుని సినిమాల్లో పెట్టుబడిగా పెడతారు. కానీ కొంతమంది నిరుద్యోగపు వర్గాలు, పని లేకుండా తిరిగే వాళ్లు, వాళ్ల కష్టాన్ని మొత్తం నీరులో కలిపేస్తారు. కోట్ల బడ్జెట్ పెట్టి, పెద్ద స్టార్స్‌ను తీసుకుని, భారీగా విడుదల చేసిన సినిమాలను 24 గంటలు కూడా గడవక ముందే లీక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, తాము చేసిన నేరంలోనే పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇప్పటికే ఎన్నో పెద్ద సినిమాలు ఈ పైరసీ బారిన పడి భారీ నష్టాలను చవిచూశాయి. ఎన్ని ప్రాజెక్టులు థియేటర్లలో మంచి కలెక్షన్లు సాధించే పరిస్థితి ఉన్నా, పైరసీ కారణంగా కలెక్షన్లు పడిపోయాయి. ఇప్పుడు ఇదే పరిస్థితి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన తాజా చిత్రం “ఓజీ” విషయంలోనూ ఎదురైంది.
పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నిన్న థియేటర్లలో విడుదలై సూపర్ డూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజే థియేటర్ల వద్ద ఫ్యాన్స్ భారీ హంగామా చేశారు. సోషల్ మీడియాలో కూడా సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. కానీ అభిమానుల ఆనందానికి తీరని షాక్ ఇచ్చేలా, సినిమా విడుదలైన 24 గంటలు కూడా గడవక ముందే మొత్తం హ్డ్ ప్రింట్ టెలిగ్రామ్ గ్రూపులు, పలు పాపులర్ వెబ్‌సైట్లు, పైరసీ పోర్టల్స్‌లో దర్శనం ఇచ్చింది.ఈ విషయాన్ని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "సినిమాకి ఎంత పెద్ద పాజిటివ్ టాక్ రావడంతోనే దాన్ని కావాలని కొందరు పైరసీ చేశారు. మూవీ మేకర్స్ ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడ్డారో, ఎన్ని వందల మంది ఆ సినిమాకి తమ చెమటోడ్చారో మీకు తెలుసా? వాళ్ల కష్టాన్ని ఇలా ఒక నిమిషంలో నాశనం చేస్తారా?" అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ వార్త పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. "పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను HD ప్రింట్ రూపంలో లీక్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా వారిని బలంగా శిక్షించాలి. ఇకపై ఎవరికీ అలాంటి ధైర్యం రాకుండా ఉండాలి" అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ పైరసీపై తీవ్ర చర్చ జరుగుతోంది. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్‌మెంట్ మాత్రమే కాదు, అది లక్షలాది మంది జీవనాధారం. పైరసీ వల్ల సినిమాలు నష్టపోతే, నిర్మాతలే కాదు, వేల మంది సినీ కార్మికులు కూడా ఇబ్బందులు పడతారు. కాబట్టి పైరసీని అరికట్టడానికి ప్రభుత్వం, సినీ సంస్థలు, ప్రేక్షకులు అందరూ కలిసికట్టుగా ముందుకు రావాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.