టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయడం అంటే ఏ నిర్మాతకైనా, దర్శకుడికైనా ఒక పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆయన ఒకేసారి రాజకీయాలు, సినిమాలు రెండూ సమాంతరంగా కొనసాగిస్తున్నారు. చాలా ఏళ్లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ నటించే సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ మొదలయ్యేలా నిర్మాత రామ్ తాళ్లూరి ఎన్నోసార్లు ప్రయత్నించారు కానీ అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. రామ్ తాళ్లూరి పవన్ కళ్యాణ్‌కు దగ్గరి వ్యక్తి. 2019 ఎన్నికల తర్వాత పవన్ ఆర్థికంగా, రాజకీయంగా కొత్త దశలోకి వెళ్ళినప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచిన వారిలో రామ్ కూడా ఒకరు. పవన్ వీరాభిమాని అయిన రామ్, ఆయనతో సినిమా చేయాలన్న కల నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే ఆ సమయంలో భారీ అడ్వాన్స్ ఇచ్చారు. అది అప్పటివరకు పవన్ పొందిన అత్యధిక పారితోషికం. ఇప్పుడు వడ్డీలతో కలిపి అది దాదాపు రు. 100 కోట్లకు చేరిందని సమాచారం. అంతేకాదు, పవన్ పేరిట ఓ స్థలం కొనడం, ఆ స్థల విలువ ఇప్పుడు పది రెట్లు పెరగడం కూడా ప‌వ‌న్ రామ్ తాళ్లూరికి న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు.


సురేందర్ రెడ్డిని ఈ ప్రాజెక్ట్‌కి రప్పించారు. వక్కంతం వంశీ కథ పవన్‌కి నచ్చడంతో సినిమా ఫిక్స్ అయినట్టే కనిపించింది. కానీ మధ్యలో పవన్ రాజకీయ బిజీ షెడ్యూల్, ‘హరిహర వీరమల్లు’, ‘భీమ్లా నాయక్’, ‘బ్రో’ సినిమాల వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయినప్పటికీ పవన్ ఇచ్చిన మాట రామ్ తాళ్లూరికి గుర్తే. అందుకే ఇప్పుడు మళ్లీ ఈ సినిమా ముందుకు వస్తుందన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఇక సురేందర్ రెడ్డి వైపు చూస్తే, ‘ఏజెంట్’ తర్వాత ఆయన కెరీర్‌లో గ్యాప్ వచ్చింది. ఈలోగా రవితేజతో సినిమా చేయడానికి సన్నాహాలు చేశారు. కానీ అదే సమయంలో పవన్ నుంచి మళ్లీ పిలుపు రావడంతో ఆయన కన్‌ఫ్యూజన్‌లో పడ్డారు. రవితేజతో కొనసాగాలా, లేక పవన్‌తో వెళ్లాలా? అన్నది సవాల్‌గా మారింది. పైగా రామ్ తాళ్లూరి దగ్గర ఆయన ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నారు కాబట్టి, పవన్ ప్రాజెక్ట్‌ను వదిలేయడం కష్టమే.


అయితే ఇక్కడ ప్రధాన అడ్డంకి పవన్ షెడ్యూల్. ఆయన రాజకీయ బాధ్యతల కారణంగా రోజుకు కొన్ని గంటలే షూట్ చేయగలరు. సురేందర్ రెడ్డి సినిమాలు స్టైలిష్‌గా, డీటైల్‌గా తీయడం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఒకసారి సినిమా మొదలయితే పూర్తి కావడానికి ఎక్కువ కాలం పట్టే అవకాశం ఉంది. స్క్రిప్ట్ రెడీగా ఉంది, నిర్మాత పారితోషికం చెల్లించారు. రాబోయే వారం లేదా పది రోజుల్లో పవన్ - సురేందర్ రెడ్డి మధ్య మీటింగ్ జరగనుందని సమాచారం. అయితే ప‌వ‌న్ అనుకున్న‌ట్టుగా సురేంద‌ర్‌కు ఎంత వ‌ర‌కు కోప‌రేట్ చేస్తాడు ? అస‌లు ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళుతుందా ? లేదా ? అన్న‌ది త‌లా తోకా లేని ప‌రిస్థితే.

మరింత సమాచారం తెలుసుకోండి: