"ఇంటింటికీ వెళ్లండి, గడప గడప తొక్కండి, మంచి ఎమ్మెల్యే అని పేరున్నా సరే.. ఎన్నికల నాటికి ప్రతి ఇంటికి వెళ్లకపోతే గెలవడం కష్టం" అని సీఎం జగన్ వైసీఎల్పీ మీటింగ్ లో తేల్చి చెప్పారు. సర్వే లెక్కల ప్రకారమే సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. ఆ లెక్కల ప్రకారమే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లిస్తామన్నారు. ఇంతకీ జగన్ చెబుతున్న లెక్కలేంటి, ఆయన దగ్గర ఉన్న సర్వేలేంటి.. ఇప్పటికే సర్వే చేశారా.. లేక ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేసిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు సర్వే చేయిస్తారా..? అసలు జగన్ మనసులో ఏముంది..?

జగన్ దగ్గర ఇప్పటికే ఓ లిస్ట్ ఉందని సమాచారం. ఆ లిస్ట్ ప్రకారమే ఎమ్మెల్యేల పనితీరుని ఆయన బేరీజు వేసుకుంటున్నారు. సహజంగా రాష్ట్రంలో ఆర్థిక కష్టాల వల్ల ఎమ్మెల్యేలెవరికీ నిధులు సరిగ్గా రావడంలేదు కాబట్టి.. అన్ని నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తిరగడం మానేశారు. సొంత వ్యాపారాలు చూసుకుంటున్నారు. ఆ  బిజినెస్ వ్యవహారాల్లో పడి జనాల్ని మర్చిపోయారు. దీంతో ఇలాంటివారిపై సహజంగానే నియోజకవర్గాల్లో కాస్త వ్యతిరేక వచ్చింది. కానీ వారంతా ఎన్నికల టైమ్ లో బాగా ఖర్చు పెడితే గెలిచేస్తాం కదా అనే ధీమాలో ఉన్నారు. కానీ ఆ ధీమా సరికాదని ఇన్ డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు జగన్.

టీడీపీ రెడీగా ఉంది..
ఎన్నికలనాటికి వైసీపీ అసంతృప్తులంతా తమవైపు వచ్చేస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుని ఉంది. ఈలోగా జగన్ సర్వేలంటూ బాంబు పేల్చారు. అప్పటి వరకూ ఎమ్మెల్యేగా ఉండి.. చివరకు సర్వేలో పాజిటివ్ రిజల్ట్ రాకపోతే వేరే వారికి టికెట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే ఏం చేయాలి. ఆల్టర్నేట్ గా ఉండే పార్టీలోకయినా వెళ్లాలి, లేదా పార్టీకోసం నమ్మకంగా ఉండాలి. ఈరోజుల్లో అదే పార్టీలో ఉండే నాయకులు అరుదు. అందుకే టీడీపీ అలాంటివారికోసం ఎదురు చూస్తోంది. వైసీపీలో అసంతృప్తులకు గేలం వేయడానికి రెడీగా ఉంది. మరి టీడీపీ గేలానికి ఎంతమంది చిక్కుకుంటారో ఇప్పుడే చెప్పలేం. ఎన్నికలనాటికి వైసీపీలో ఎవరికి టికెట్లు ఇస్తారు, ఎవరికి హ్యాండ్ ఇస్తారు అనే దానిపై ఓ క్లారిటీ వస్తుంది. అప్పటి వరకూ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి, ఆ తర్వాత తమ భవిష్యత్ నిర్ణయించుకోవాలనుకుంటున్నారు చాలామంది. వీరందరి పనితీరుకి, రాజకీయ భవిష్యత్తుకి ఆ సర్వేలే ఆధారం అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: