రాజకీయాల్లో ఏ చిన్న విషయాన్ని అయినా ఆయా పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవడం కొత్త విషయం కాదు. ముఖ్యంగా ఎన్నికల సమయం దగ్గరగా ఉన్నప్పుడు, చిన్న విషయాన్నీ పెద్ద ఇష్యూగా మార్చి రాజకీయ ల‌బ్ధి పొందేందుకు ప్రయత్నిస్తారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబానికి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారితీశాయి. బాల‌య్య‌ అసెంబ్లీలో మాట్లాడిన కొన్ని మాటలను వైసీపీ తమ వ్యూహాలకు ఆయుధంగా మార్చుకుంటోంది. 2022 - 23 మధ్య సినీ పరిశ్రమ సమస్యలపై అప్పటి సీఎం జగన్‌తో జరిగిన సమావేశాన్ని గుర్తుచేసుకుంటూ, బాలకృష్ణ ఆ సందర్భంలో సినీ పెద్దలపై కొన్ని కామెంట్లు చేశారు.


ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని “వాడు-వీడు” అని సంబోధించడం పెద్ద వివాదం అయింది. ఈ వ్యాఖ్యను వైసీపీ పూర్తిగా హైలైట్ చేస్తూ, మెగా అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, “చిరంజీవిని అవమానించారు” అనే కోణంలో ముందుకు సాగుతున్నారు. ఇదంతా వైసీపీకి ఎంతవరకు లాభం చేకూరుస్తుందో అనేది చూడాలి. ఎందుకంటే చిరంజీవి స్వయంగా స్పందించి, “మాకు ఎటువంటి అవమానం జరగలేదు. జగన్‌ గౌరవంగా ఆహ్వానించి, భోజనం పెట్టి, మా సమస్యలు విన్నారు” అని అన్నారు. చిరు వ్యాఖ్యలు కూడా పరోక్షంగా వైసీపీకి కలసివచ్చేలా ఉన్నాయి. అంటే, బాలయ్య వ్యాఖ్యలను ప్రతికూలంగా చూపిస్తూ, చిరంజీవి గౌరవానికి మద్దతు ఇవ్వడం ద్వారా వైసీపీ తమ ప్రచారాన్ని మరింత బలపరచుకుంటోంది.


ఇక టీడీపీలో కూడా బాలకృష్ణ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అసెంబ్లీలో మాట్లాడుతూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు పెద్దలను ఆహ్వానించిందని, అయితే ఆ జాబితాలో తన పేరును 9వ స్థానంలో చేర్చారని పేర్కొన్నారు. తనకన్నా ఎనిమిది మంది ముందున్నారని చెబుతూ మంత్రి దుర్గేష్‌పై వ్యాఖ్యలు చేయడం టీడీపీ నేతల్లోనూ అసౌకర్యం కలిగించింది. పార్టీ లోపలే కొందరు బాలయ్య ఎందుకు ఇలాంటి వ్యాఖ్య చేశారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొత్తం మీద, బాలయ్య వ్యాఖ్యలు ఇప్పుడు రెండు వైపులా రాజకీయ వాదనలకు దారితీశాయి. వైసీపీ దీనిని మెగా అభిమానులను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంటే.. టీడీపీ క‌క్క‌లేక మింగ‌లేక చందంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: