తాజా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కేంద్రప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. విభజన హామీలు అనేకం పెండింగులో ఉన్నప్పటికీ వాటికి నిధుల కేటాయించలేదు. పోలవరం, రైల్వేజోన్ లాంటి కీలక అంశాలను కూడా పట్టించుకోలేదు. ఏదో రోటీన్ గా విధిల్చే కొద్దిపాటి నిధులు తప్ప ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తికి స్పందించి పలానా ప్రాజెక్టుకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని చెప్పుకునేందుకు ఒక్క కేటాయింపుకూడాలేదు. ఏపీ విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వం మొదటినుండి ఇదే విధమైన వైఖరిని అనుసరిస్తోంది.

ఇలాంటి నిర్లక్ష్యపు వైఖరికి కారణం ఏమిటి ? ఏమిటంటే ఇపుడు జగన్ ఇంతకుముందు చంద్రబాబునాయుడు చేతకానితనం అనే చెప్పాలి. వీళ్ళ మీదున్న కేసుల కారణంగానే కేంద్రాన్ని నిలదీయలేని నిస్సహాయస్ధితిలో ఉండిపోతున్నారు. చివరకు వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్రప్రయోజనాలను కూడా పణంగా పెట్టేస్తున్నారు. దీన్ని మోడి సర్కార్ అలుసుగా తీసుకుని నిధుల కేటాయింపులో మొండిచేయి చూపుతున్నది. మోదీని నిలదీయలేని వీళ్ళిద్దరు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటు కాలం గడిపేస్తున్నారు.

ఇపుడు కూడా బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే జగన్ పై  చంద్రబాబు తీవ్రస్ధాయిలో ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే కేంద్రం రాష్ట్రాన్ని పట్టించుకోవటంలేదంటు బురదచల్లేశారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జగన్ కూడా చంద్రబాబు చేతకానితనం వల్లే కేంద్రం నిధులు కేటాయించలేదని మండిపడేవారు. విచిత్రం ఏమిటంటే ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచెయ్యి చూపించిన నరేంద్రమోడి ప్రభుత్వంపైన మాత్రం ఇద్దరు నోరెత్తటంలేదు.

కేంద్రం నుండి నిదులు, ప్రాజెక్టులను సాధించుకోవటంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలను  చూసికూడా మన నేతలు ఏమీ నేర్చుకోకపోవటం బాధాకరమే. జగన్, చంద్రబాబు మధ్య ఉన్న తీవ్ర విభేదాలు రాష్ట్రాభివృద్ధికి శాపంగా మారింది. తాజా బడ్జెట్ ను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి బాగుందంటే, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు మాత్రం బాగాలేదన్నారు. బడ్జెట్ బాగుందో లేదో చెప్పకుండా చంద్రబాబు మాత్రం జగన్నే టార్గెట్ చేశారు. ఇక జనసేన అధినేత మాత్రం బడ్జెట్ బాగుందన్నారు. ఎన్ని నిధులు కేటాయించినా, ప్రాజెక్టులిచ్చినా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదనే మోడీ సర్కార్ ఏపీని ఏమాత్రం పట్టించుకున్నట్లులేదు. ఎంతకాలం ఇలా జరుగుతుందో చూడాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: