ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. టికెట్ల రేసులో ఎవరున్నారు.. ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు.. రాజకీయ, సామాజిక సమీకరణాలు ఏమేరకు కలిసివస్తాయనే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.. నలుగురు కలిస్తే చాలు ఇదే ముచ్చట ముందుకొస్తోంది.. ఇక ఏపీలో అధికార టీడీపీలో మాత్రం వచ్చే ఎన్నికల్లో ముగ్గురు జెడ్పీ చైర్మన్లు టికెట్ల రేసులో ఉన్నారు. ఇప్పటి నుంచి పార్టీ అధిష్టానం వద్ద మంచి మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇందులో ఒకరికి కుటుంబ నేపథ్యం, మరొకరికి సామాజిక సమీకరణాలు.. ఇంకొకరికి రాజకీయ నేపథ్యం కలిసివచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ముగ్గురు జెడ్పీ చైర్మన్లలో పశ్చిమగోదావరి జిల్లా జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, విజయనగరం జెడ్పీ చైర్‌పర్సన్ శోభా స్వాతిరాణితో పాటు గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ పేర్లు అసెంబ్లీ రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

పశ్చిమ జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చూస్తున్నారు. 2009లో తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే రేసులో ఉన్నారు. గత ఎన్నికల్లో గూడెం సీటును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంతో చంద్రబాబు బాపిరాజును జెడ్పీ చైర్మన్‌గా చేశారు. చైర్మన్‌గా ఉన్న బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేశారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల బరిలోకి దిగేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు.

విజయనగరం జెడ్పీచైర్ పర్సన్ శోభా స్వాతిరాణి అరకు పార్లమెంటు టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఆమె సొంత ప్రాంతం విశాఖలోని అనంతగిరి కావడం, తల్లి మాజీ ఎమ్మెల్యే హైమావతికి నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉండడం, పెద్దగా ఇక్కడి నుంచి టికెట్ కోసం పోటీ లేకపోవడం కలిసొచ్చే అంశాలు. విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాల్లో అరకు ఎంపీ స్థానం విస్తరించి ఉంది. విజయనగరం జిల్లాలో అరకు ఎంపీ పరిధిలోకి వచ్చే సాలూరు, కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాల్లో శోభా స్వాతిరాణి చురుగ్గా పర్యటిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే.. సాలూరు లేదా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా ఆమెను బరిలోకి దించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఆమెకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లలో ఏది దక్కుతుందో ? చూడాలి. స్వాతి రాణికి ఎంపీ లేదా ఎమ్మెల్యే సీటు రావడం అయితే ఖాయంగా అక్కడ రాజకీయ సమీకరణలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్ కూడా గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉండే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఆమె 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకుమాను జెడ్పీటీసీ గా గెలుపోంది మైనార్టీ మహిళ కోటాలో జెడ్పీ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆమెకు రాజకీయ, సామాజిక సమీకరణాలు కూడా కలిసివచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, గుంటూరు తూర్పు టికెట్‌ను ప్రధాన పార్టీలు మైనారిటీలకే కేటాయిస్తుంటాయి. అయితే గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ వైశ్య వర్గానికి సీటు ఇచ్చినా గెలవలేకపోయారు. నిజానికి ఇక్కడ గత మూడు ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోయింది. ఈసారి మైనారిటీలకు టికెట్ ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉండడం జానీమూన్‌కు కలిసివచ్చే అంశమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
