చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం రికార్డు సృష్టించింది. ఒకే ఎన్నికలో ఒకే కుటుంబం నుండి గెలవటం ఇదే మొదటిసారి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నుండి ఎంఎల్ఏగా భారీ మెజారిటీతో గెలిచారు. తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి తంబళ్ళపల్లి  నుండి ఎంఎల్ఏగా గెలిచారు. ఇక పెద్దిరెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుండి ఎంపిగా గెలిచారు.

 

పుంగనూరులో పోటీ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సునాయాసంగానే గెలిచారు. ఎన్నికల సమయంలో టిడిపి అభ్యర్ధి అనూషారెడ్డి ఏదో గట్టి పోటీ ఇచ్చినట్లుగా బిల్డప్ ఇచ్చినప్పటికి చివరకు తేలిపోయింది. దాంతో రామచంద్రారెడ్డి టిడిపిపై 47,200 మెజారిటీతో గెలిచారు.

 

ఇక తంబళ్ళపల్లిలో టిడిపి తరపున సిట్టింగ్ ఎంఎల్ఏ శంకర్ యాదవ్ పోటీ చేయగా వైసిపి తరపున ద్వారకనాధరెడ్డి రంగంలోకి దిగారు. శంకర్ కు టికెట్ ఇవ్వద్దని టిడిపి నేతలు ఎంత చెప్పినా వినకుండా చంద్రబాబు సిట్టింగ్ ఎంఎల్ఏకే టికెట్ ఇవ్వటం పెద్ద మైనస్ అయిపోయింది. అదే సమయంలో వైసిపిలో నియోజకవర్గంలో పార్టీ పటిష్టానికి పెద్దిరెడ్డే అన్నీ తానై నడిపించారు. అందుకే తమ్ముడు ద్వారకాకు టికెట్ ఇప్పించుకున్నారు. చివరకు పార్టీ నేతలతో సమన్వయం సాధించటం ద్వారా గెలిపించుకున్నారు.

 

అలాగే రాజంపేటలో కొడుకు మిథున్ రెడ్డి పోటీ చేశారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోకే పుంగనూరు, తంబళ్ళపల్లి అసెంబ్లీ రావటం మిథున్ కు బాగా కలసివచ్చింది. పై రెండు అసెంబ్లీల్లో వచ్చిన మెజారిటికి తోడు కడప జిల్లాలోని అసెంబ్లీల మెజారిటితో మిథున్ రెడ్డి రెండోసారి వరుసగా గెలిచారు. పోటీ చేసిన ముగ్గురు గెలవటంతో పెద్దిరెడ్డి కుటుంబం రికార్డు సృష్టించినట్లైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: