ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజధాని రాజకీయం నడుస్తోంది. గత చంద్రబాబు సర్కారు 13 జిల్లాలకు సెంటర్ పాయింట్ గా ఉంటుందంటూ అమరావతిని రాజధానిగా ప్రకటించింది. అయితే రాజధాని ఎంపిక విషయంలో చంద్రబాబు సర్కారు అన్ని పార్టీలను సంప్రదించడం చేయలేదు. దూకుడుగా సొంత నిర్ణయం తీసుకుంది. అప్పట్లో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును కూడా పక్కకు పెట్టేసింది.


అయితే ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. అమరావతిని మారుస్తారననే ఊహాగానాలు మొదలయ్యాయి. జగన్ సీఎం అయి మూడు నెలలవుతున్నా రాజధాని గురించి ప్రత్యేకంగా ఎక్కడా మాట్లాడకపోవడం కూడా అనుమానాలు పెంచింది. దీనికి తోడు ఇప్పుడు కృష్ణా నదికి వరదలు వచ్చిన నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. రాజధాని విషయంలో ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన చెప్పారు.


దీనికి మరింత కొనసాగింపుగా జగన్ అమరావతిని రాజధానిగా కొనసాగించబోడని ఎంపీ టీజీ వెంకటేశ్ కామెంట్ చేయడం మరింత కాంట్రావర్సీ చేసింది. జగన్ నాలుగు రాజధానులు చేస్తాడని ఆయన చెబుతున్నారు. అంతే కాదు.. అమరావతిపై టీడీపీ ఎక్కువగా ఫోకస్ చేయడం వల్లే మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మీదే దృష్టి పెట్టడంతో ఎన్నికల్లో టీడీపీతో పాటు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ కూడా ఓడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.


అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవడం ఖాయమన్నారు. పెట్టుబడుల వికేంద్రీకరణ జరగాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదన్నారు. గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనడం హాస్యాస్పదమని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులను వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రారంభిస్తే.. చంద్రబాబు దాన్ని కొనిసాగించారని టీజీ అన్నారు. అమరావతిని ఫ్రీజోన్‌ చేయాలని గతంలోనే తాను అడిగానని ఎమ్.పి టిజి వెంకటేష్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: