తిరుమల తిరుపతి దేవస్థానములు.. హిందువులు అతి పవిత్రంగా భావించే దేవాలయాల సముదాయం.. తెలుగు రాష్ట్రాల్లో హిందూ ధర్మాన్ని వికసింపజేస్తున్న సంస్థలు. కానీ ఈ టీటీడీలోనే అన్యమత ప్రచారం జరుగుతోందా.. ఇది కొన్నాళ్లుగా సాగుతున్న ప్రచారం. జగన్ సీఎం అయిన తర్వాత జరిగిన కొన్ని ఘటనలు ఈ అనుమానాలకు తావిస్తున్నాయి.

 

ఇలాంటి ప్రచారాలకు సోషల్ మీడియా వేదిక అవుతోంది. మొదట్లో తిరుమల కొండపై సిలువ స్తంభం ఉందంటూ ప్రచారం సాగింది. ఆ తర్వాత బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం జరిగిందని వార్తలు వచ్చాయి. తాజాగా ఏకంగా టీటీడీ వెబ్ సైట్లో శ్రీ యేసయ్య అంటూ స్లోగన్ ఉందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది.

 

ఈ నేపథ్యంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వదంతులపై వివరణ ఇచ్చారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలలో చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణలు కలిసి కుట్రలు చేస్తున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. కుట్రలో భాగంగానే టీటీడీలో అన్యమత ప్రచారమని దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ అవసరాల కోసం తిరుమలను వాడుకుంటూ రాష్ట్రంలో మత కల్లోలం సృష్టించాలని వారు భావిస్తున్నట్లు ధ్వజమెత్తారు. అతిపెద్ద హిందూ దేవస్థానమైన టీటీడీపై అన్యమత ముద్ర వేస్తూ ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురణ చేయడం దురదృష్టమని పేర్కొన్నారు.

 

మీడియా చేతిలో ఉందని తప్పుడు వార్తలు ప్రచారం చేయడాన్ని దేవుడు కూడా క్షమించడని దుయ్యబట్టారు. వైఎస్సార్‌సీపీని అన్ని మతాల వారు ఓట్లు వేసి గెలిపించారు. టీటీడీలో ఇతర మతాలకు సంబంధించిన గుర్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో ఎలాంటి అన్యమత ప్రచారం జరగడం లేదని ఆయన స్పష్టం చేశారు. దీనిపై గూగుల్‌ నుంచి వివరణ కోరనున్నట్లు ఆయన తెలిపారు. మరి ఈ పత్రికపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: