ఇటీవల ఏపీలో ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. మీడియాన్ని ఎంచుకోవాల్సిన హక్కు తల్లిదండ్రులదే అని తేల్చి చెప్పింది. అయినా పట్టు వీడని సీఎం జగన్... ఈ విషయంలో మరోవైపు నుంచి నరుక్కొస్తున్నారు. తల్లిదండ్రులు తేల్చుకుంటారు అన్నారు కదా.. అని వారి అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన లెక్కల ప్రకారం తల్లిదండ్రులు నూటి 96 శాతానికిపైగా ఇంగ్లీష్ మీడియానికే జైకొట్టారట.

 

 

ఈమేరకు తమ ఆప్షన్ తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అంగీకారాన్ని తెలియజేశారని ప్రభుత్వం ప్రకటించుకుంది. నూటికి 96.17శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇంగ్లీషు మాధ్యమమే కావాలని చెప్పారట. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రస్తుత 2019 – 2020 విద్యాసంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ చదువుతున్న తల్లిదండ్రుల అభిప్రాయాలను తెలుసుకునేందుకుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్షేత్ర స్థాయిలో వారి అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తీసుకుంది.

 

 

ఈ అభిప్రాయ సేకరణకు ఓ ఫార్మాట్ రూపొందించింది. తల్లిదండ్రులకు మూడు ఆప్షన్లు ఇచ్చింది. మొదటిది ఇంగ్లిషు మీడియంలో బోధిస్తూ, తెలుగు తప్పనిసరి సబ్జెక్టు చేయడం, రెండోది పూర్తిగా తెలుగు మీడియంలో బోధన, మూడోది ఇతర భాషా మీడియం. ఈ మూడు ఆప్షన్లపై తల్లిదండ్రులు టిక్‌చేసి, సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపించారు. సర్కారు లెక్కల ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో 1 నుంచి 5వ తరగతి వరకూ 17,87,035 మంది విద్యార్థులు ఉంటే.. 17,85,669 మంది తమ ఆప్షన్ చెబుతూ సంతకాలు చేసి ప్రభుత్వానికి పంపారు.

 

 

తెలుగు మీడియం కోరుకున్న వారు కేవలం 3.05 శాతం మందేనట. ఇంకా ఇతర భాషా మీడియం కోరుకున్న వారు 0.78 శాతమట. ఈ లెక్కలను బట్టి చూస్తే హైకోర్టు చెప్పినా ఇంగ్లీష్ మీడియం విషయంలో జగన్ ఆగేలా లేడు మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: