
దేశంలో కరోనా కర్వ్ త్వరలోనే ఫ్లాటవుతుందని.. మరో వంద రోజుల్లో ఈ మహమ్మారి దేశం నుంచి అంతరించిపోతుందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ ఆసక్తికర కథనం ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం.. సెప్టెంబరు 2 నాటికి దేశంలో 7.87 లక్షల యాక్టివ్ కేసులు ఉంటాయి. అప్పట్నుంచీ సెప్టెంబరు 16 దాకా కేసుల సంఖ్య స్థిరంగా ఉంటుంది. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చి.. డిసెంబరు 3నాటికి పూర్తిగా తగ్గిపోతుందని ఈ నివేదిక చెబుతోంది.
కరోనాతో సతమతమైన ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ తదితర దేశాల్లో కూడా ఇలాగే కరోనా పాజిటివ్ ల సంఖ్య ఒక దశలో పతాకస్థాయికి చేరి అక్కడి నుంచి తగ్గుముఖం పట్టింది. అదే దశ మనదేశంలో కూడా త్వరలోనే రాబోతోందని టైమ్స్ ఫ్యాక్ట్ ఇండియా అవుట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తెలంగాణలో ఆగస్టు 15 నాటికే కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరిందని.. అక్టోబరు 17 నాటికి పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఐవోఆర్ అంచనా. ఆంధ్రప్రదేశ్ లో ఆగస్టు 23 నాటికి కేసుల సంఖ్య పతాకస్థాయికి చేరి.. అక్టోబరు 28 నాటికి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందని రిపోర్ట్ చెబుతోంది.