2019 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైతే కాని టీడీపీ అధినేత చంద్రబాబుకు అసలు విషయం బోధ పడలేదు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తున్న బీసీ సామాజికవర్గం పూర్తిగా దూరమైందనే విషయం అర్థం చేసుకునే సరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాపు సామాజిక వర్గం పై పూర్తిగా దృష్టి పెట్టడం తోనే, బీసీ సామాజిక వర్గం ఎప్పుడూ లేని విధంగా టిడిపికి దూరమైంది. 2014 ఎన్నికల వరకు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా నిలబడుతూ వచ్చారు. అంతకుముందే కాపులను బీసీల్లో చేరుస్తూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో టీడీపీ అధికారంలో ఉండగా తమను చేస్తామంటూ ఇచ్చిన హామీపై ఆ సామాజిక వర్గం నిలదీయడంతో పాటు పెద్ద ఎత్తున ముద్రగడ పద్మనాభం నిర్వహించారు. క్రమంగా కాపు సామాజిక వర్గం టీడీపీకి దూరం అవుతుంది అన్న ఆందోళనలో చంద్రబాబు ఆ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు  అధికారంలో ఉండగా అనేక వరాలు ఇచ్చారు.


కాపు కార్పొరేషన్ ద్వారా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, ఆ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పార్టీకి బీసీలు దూరమవుతున్నారనే విషయాన్ని గుర్తించే సరికి 2019 ఎన్నికల్లో ఎప్పుడు లేని విధంగా బీసీ సామాజిక వర్గం టీడీపీకి దూరమైంది.  వైసిపి అధినేత జగన్ పాదయాత్ర సమయంలో కాపులను బీసీల్లో చేర్చుతాను అని చంద్రబాబు మాదిరిగా మోసం చేయను అని, అది తమ పరిధిలోని అంశం కాదని చెప్పడంతో చంద్రబాబు ఖుషి అయ్యారు. కాపు సామాజిక వర్గం మొత్తం టీడీపీకి అండగా నిలబడుతుందని అంచనా వేశారు. కానీ, కాపులు టిడిపిని పెద్దగా ఆదరించలేదు. వైసిపికి కొంతమంది మద్దతుగా నిలబడగా, జనసేన పార్టీకి మరికొంతమంది  నిలబడ్డారు. ఇక అప్పటికే బీసీలు దూరమవడంతో ఘోరంగా 23 సీట్లకే టిడిపి పరిమితమైంది.


ఇక ఇప్పుడు జనసేన బిజెపి పార్టీలు పూర్తిగా అదే సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్ తో పాటు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అదే కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఎన్ని హామీలు ఇచ్చినా, ఆ సామాజిక వర్గం తమ వైపు నిలబడదు అనే విషయాన్ని గుర్తించారు. అందుకే ఇప్పుడు టిడిపిలో బిసి సామాజిక వర్గానికి ప్రాధాన్యం పెరిగేలా, పార్టీ పదవుల్లో వారికే ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. భవిష్యత్తులోనూ, బీసీలకు పార్టీ పదవులు వీలైనంత ఎక్కువ కేటాయించాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: