కర్ణాటకలో ఉన్న
ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఆ కంపెనీ ఉద్యోగులు విధ్వంసం సృష్టించారు. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఈ ప్లాంట్ ఉంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారని చెబుతున్నారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు పెట్టారు.కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు సీనియర్ పోలీసు అధికారులు అదనపు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సుమారు 130 మందిని అరెస్టు చేశారు.
తైవానీస్ టెక్ జెయింట్ విస్ట్రన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ కంపెన ప్లాంట్‌లో ఉదయం షిఫ్ట్‌లో సుమారు 2 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వారంతా ఒక్కసారిగా ఆందోళనకు దిగారని తెలుస్తోంది. కొందరు ఉద్యోగులు తమ ఫోన్లతో తీసిన వీడియోలలో పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి.
అయితే ఐఫోన్ తయారీ ప్లాంట్ లో జరిగిన హింసపై ఇంత వరకు విస్ట్రన్ కార్పొరేషన్ స్పందించలేదు. బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో కోలార్ సమీపంలోని నర్సాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉంది. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ. 2,900 కోట్ల పెట్టుబడి పెడతామని, 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పిస్తామనే ఒప్పందంతో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.