చైనా నుంచి మరో రూపంలో ముప్పు....?

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

ఇప్పటివరకు సరిహద్దుల్లో బలగాలను మోహరిస్తూ పొరుగుదేశాలను భయపెడుతూ వచ్చిన చైనా నుంచి మరో రూపంలో ముప్పు పొంచి ఉంది. దేశీయ అవసరాల పేరిట జల విద్యుత్ ఉత్పత్తి కోసం డ్రాగన్‌.. మెడోగ్ కౌంటీగా పేరొందిన టిబెట్ అటానమస్ రీజియన్‌లో రిజర్వాయర్ నిర్మించాలని చైనా తీసుకున్న నిర్ణయం మన ఈశాన్య రాష్ట్రాలకు, బంగ్లాదేశ్‌కూ ప్రాణ సంకటంగా మారనున్నది. 2010లో యర్లంగ్ ట్సాంగ్‌పో వద్ద నిర్మాణం చేపట్టిన డ్యామ్‌లకు ఇది అదనం. 60 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఈ డ్యామ్ సాయ పడుతుందని జీ జిన్‌పింగ్ సర్కార్ ఆశపడుతోంది.

ఈ నేపథ్యంలో ఢిల్లీలో 'డ్రాగన్ హైడ్రో పవర్ వ్యూహం డీకోడింగ్‌: సవాళ్లు, ముప్పు, ప్రతిస్పందనలు' అనే అంశంపై ఈ నెల ఆరో తేదీన జరిగిన చర్చాగోష్టిలో పాల్గొన్న నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్చాగోష్టిలో అరుణాచల్ ప్రదేశ్ ఎమ్మెల్యే నినోంగ్ ఎరింగ్‌, జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపర్ణ పాఠక్‌, యూఎస్ ఆర్మీ వార్ కాలేజీ స్ట్రాటర్జిక్ స్టడీస్ ఇన్‌స్టిట్యూట్ లాటిన్ అమెరికన్ స్టడీస్ రీసెర్చ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎవాన్ ఇల్లియాస్‌, మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ జియో పాలిటిక్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ధనశ్రీ జయరామ్ పాల్గొన్నారు.

ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతిపెద్దదిగా పేరొందిన త్రీ గోర్జెస్ డ్యామ్ సామర్థ్యానికి ఇది మూడు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే భూకంప, పర్యావరణ ముప్పు పొంచి ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. సియాంగ్ నది పరీవాహాక ప్రాంతంలో 2001లో వచ్చిన వరదలతో అరుణాచల్‌ప్రదేశ్‌లో అత్యధిక ప్రాణనష్టం జరుగడంతోపాటు భూమి, పంటలు, పశు సంపద దెబ్బతిన్నాయి.

చైనా నిర్మించే ప్రాజెక్టుతో అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు వరుసగా సరిహద్దుల్లో చైనా డ్యామ్‌లు నిర్మాణం చేపట్టడం వల్ల మనదేశ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. డ్రాగన్‌ను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం దౌత్యపరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.ఉద్దేశపూర్వకంగా బ్రహ్మపుత్ర నదీ జలాలను తన సొంతానికి చైనా వాడుకుంటున్నదన్న విమర్శ ఉంది. 

దీనివల్ల దిగువన ఉన్న భారత్‌, బంగ్లాదేశ్‌లకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటివరకు భారత్‌, చైనా మధ్య నదీ జలాల పంపిణీ ఒప్పందాలు లేవు. ఈ పరిస్థితుల్లో డ్రాగన్‌తో తప్పనిసరిగా జలాల పంపిణీ ఒప్పందాన్ని భారత్ చేసుకోవాల్సి ఉంది. లేకపోతే చైనా చేపట్టే బహుళార్థక సాధక ప్రాజెక్టుల వల్ల కరవు వచ్చినప్పుడు ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు ముప్పు తప్పదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తున్నది. ఎగువన ప్రాజెక్టుల్లో నీళ్లు నిలచిపోతే, దిగువన ఉన్న ఈశాన్య రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌కు చెందిన లక్షల మంది జీవితాలు కష్టాల కడగండ్లలో చిక్కుకుంటాయన్న మాట వినిపిస్తోంది.

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: