దేవినేని ఉమా మహేశ్వరరావు కృష్ణా జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. దేవినేని రమణ మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉమా...అతి తక్కువ కాలంలోనే టీడీపీలో కీలక నాయకుడుగా ఎదిగారు. 1999 ఎన్నికల్లో తొలిసారి నందిగామ నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ వేవ్ ఉన్నా సరే ఉమా మరోసారి టీడీపీ తరుపున నందిగామలో గెలిచారు.


ఇక 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా నందిగామ ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం అయింది. దీంతో ఉమా పక్కనే ఉన్న మైలవరం వచ్చి 2009 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో సైతం ఉమా సత్తా చాటారు. అలాగే చంద్రబాబు కేబినెట్‌లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఉమాకు చెక్ పడింది.


అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి వసంత కృష్ణప్రసాద్ చేతిలో ఉమా ఓడిపోయారు. మొదటి సారి ఓటమిని చవిచూసిన ఉమా, ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీలో పనిచేస్తున్నారు. కృష్ణా జిల్లాలో మిగతా టీడీపీ నాయకులు సైలెంట్ అయిపోయినా సరే ఉమా మాత్రం, పార్టీ కోసం గట్టిగానే కష్టపడుతున్నారు. పైగా మునుపటిలాగా ఆయనకు జిల్లాపై పెత్తనం తగ్గింది. దీంతో ఉమా నియోజకవర్గానికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలోనే ఉంటూ పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే వసంతపై గట్టిగానే పోరాడుతున్నారు. ప్రభుత్వ పథకాలు వసంతకు అడ్వాంటేజ్ అవుతున్నా సరే ఉమా ఏ మాత్రం వెనక్కితగ్గకుండా మైలవరంలో టీడీపీని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.


అటు ఎమ్మెల్యేపై అనేక అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇసుక, మైనింగ్‌లో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అలాగే పక్కనే ఉన్న అమరావతి కోసం ఉమా పోరాడుతూనే ఉన్నారు. రైతులకు అండగా ఉంటున్నారు. ఇంకా నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పర్యటిస్తూ ప్రజలకు దగ్గరవుతూ, వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. అలాగే రైతుల గిట్టుబాటు ధర కోసం పోరాడుతున్నారు. ఇలా అన్నీ రకాలుగా ఉమా యాక్టివ్‌గా ఉంటూ, మైలవరంలో కాస్త పికప్ అయినట్లే కనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లోపు మైలవరంలో ఉమా సెట్ అయ్యేలాగానే ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: