కరోనా కేసుల తీవ్రత తగ్గకపోయినా లాక్ డౌన్ ఎత్తివేశారని, కేవలం ముసలి వాళ్లను టార్గెట్ చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన వద్ద పనిచేసిన మాజీ అధికారి డొమినిక్ కమ్మిన్స్ ఈ ఆరోపణలు చేశారు. తాజాగా బ్రిటన్ లో లాక్ డౌన్ ఆంక్షలు సడలించింది ప్రభుత్వం. డెల్టా వేరియంట్ ప్రభావం ఉన్నా కూడా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి.

అయితే గతంలో కూడా ప్రధాని బోరిస్ జాన్సన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కమ్మిన్స్ విమర్శలు చేశారు. గత శీతాకాలంలో బ్రిటన్ లో కరోనా మరణాలు ఎక్కువగా ఉన్నాయని, అయినా కూడా రెండోసారి లాక్ డౌన్ పెట్టేందుకు ప్రధాని వెనకాడారని చెబుతున్నారు. బ్రిటన్ లో 80ఏళ్లకు పైబడిన వృద్ధులు ఎక్కువగా కరోనాకు బలయ్యారు. పోతే పోయారు ముసలివారే కదా అంటూ ప్రధాని లాక్ డౌన్ విషయంలో లైట్ తీసుకున్నారని చెబుతున్నారు కమ్మిన్స్. వృద్ధుల మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నా కూడా రెండోసారి లాక్ డౌన్ విధించలేదని, దీనివల్ల బ్రిటన్ కు తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు.

అంతే కాదు.. నిత్యావసర మందులు కొనేందుకు కూడా ప్రధాని ఇష్టపడలేదని చెబుతున్నారు కమ్మిన్స్. కరోనా కేసులు పెరిగేందుకు, వృద్ధుల మరణాల సంఖ్య పెరిగేందుకు పరోక్షంగా ప్రధాని బోరిస్ జాన్సన్ కారణం అయ్యారని ఆరోపించారు. ప్రధాని మంత్రి కార్యాలయంలో కరోనా కేసులు ఎక్కువ ఉన్న సమయంలో బోరిస్ జాన్సన్.. 95ఏళ్ల క్వీన్ ఎలిజిబెత్ ని కలిశారని చెప్పారు. కరోనా ముప్పు ఉన్న వృద్ధులను ఎవరూ కలవకూడదనే నిబంధన ఉన్నాకూడా ప్రధాని దాన్ని ఉల్లంఘించారని అన్నారు.

అటు బ్రిటన్ లోని ప్రతిపక్షాలు కూడా లాక్ డౌన్ ని ఎత్తేయడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. డెల్టా వేరియంట్ విజృంభణ పూర్తి స్థాయిలో తగ్గక ముందే లాక్ డౌన్ తీసేశారని అంటున్నారు విపక్ష నేతలు. ఈ ఆరోపణల్ని ప్రధాని కార్యాలయం కొట్టిపారేసింది. కమ్మిన్స్ చేసిన తీవ్రమైన ఆరోపణల్ని కూడా తోసి పుచ్చింది. బ్రిటన్ లో కరోనా కట్టడికి ప్రధాని బోరిస్ జాన్సన్ తీవ్రంగా కృషిచేస్తున్నారని ఆయన వ్యక్తిగత అధికారి పేర్కొన్నారు. ముసలివారు చనిపోతుంటే ప్రధాని నిర్లక్ష్యంగా వ్యవహరించారనడం సరికాదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: