అమరావతి మహా పాదయాత్రలో రైతులు హైకోర్టు ఉత్తర్వులు, డీజీపీ ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ప్రకాశం జిల్లా ఎస్పీ మలిక్ గర్గ్ అన్నారు. 157మందిని అనుమతిస్తే.. 2వేల మంది పాల్గొన్నారని తెలిపారు. 500వాహనాలు, లౌడ్ స్పీకర్లు, భారీ ఎత్తున బాణా సంచా ఉపయోగించారన్నారు. మాస్కులు, శానిటైజర్లు కూడా వాడలేదన్నారు. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లపై దాడి కూడా చేశారని వివరించారు. దీనిపై రెండు కేసులు నమోదు చేశామన్నారు.

ఇక ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లిక్ గార్గ్ ను సంతనూతల పాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు కలిశారు. తమ నియోజకవర్గ పరిధిలో అమరావతి రైతుల పాదయాత్రను ఆపాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. స్థానిక ఎన్నికలు జరుగుతున్నందున అనుమతించొద్దని కోరారు. కనీసం పాదయాత్ర రూట్ అయినా మర్చాలని ఎస్పీని కోరిన ఎమ్మెల్యే.. అధికారులు దీనిపై స్పందించకపోతే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

ఈ రోజు ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి అమరావతి రైతుల 7వ రోజు పాదయాత్ర ప్రారంభం కాగా.. సాయంత్రం ఇంకొల్లులో ముగిసింది. రేపు కార్తీక సోమవారం సందర్భంగా పాదయాత్రకు విరామం ప్రకటించగా.. ఎల్లుండి యథావిధిగా సాగనుంది. ఈ పాదయాత్రలో వెయ్యికి పైగా మోహరించిన పోలీసులు.. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని మరోసారి హెచ్చరించారు. అనుమతి ఇచ్చిన వారికంటే అదనంగా ఉంటే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.

ఇదిలా ఉంటే అమరావతి రైతుల పాదయాత్రకు వైసీపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉక్కుపాదం మోపుతోందన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చినా.. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. సీఎం జగన్ ప్రజాసంకల్పయాత్రకు నిన్నటితో నాలుగేళ్లు పూర్తయిందని వైసీపీ నేతలు పాదయాత్రలు చేశారనీ.. దానికి అడ్డురాని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వచ్చాయా..? అని ప్రశ్నించారు. చూద్దాం .. ఈ పాదయాత్ర సవ్యంగా సాగుతుందో.. లేదో. రైతులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని చెబుతున్న పోలీసులు పలుచోట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ రూల్స్ పాటించడం లేదంటున్నారు.  




మరింత సమాచారం తెలుసుకోండి: