మన దేశంలో ఎక్కువగా వినియోగించిన కొవిషీల్డ్ టీకా ప్రభావంపై లాన్సెట్ జర్నల్ అధ్యయనం చేసింది. డెల్టా వేరియంట్ పై ఈ టీకా ఎక్కువ కాలం రక్షణ ఇవ్వలేదని వెల్లడించింది. రెండో డోసు వేసుకున్నాక మూడు నెలల్లో దాని సామర్థ్యం తగ్గుతుందని పేర్కొంది. అయితే ఒమిక్రాన్ పై కొవిషీల్డ్ పనిచేస్తుందా అనే విషయాన్ని చెప్పలేదు. ఈ సందర్భంలోనే ప్రపంచ దేశాలు బూస్టర్ డోసు ఇవ్వడంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే.. దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ ఉందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఆ దేశంలో హెచ్ఐవీ రోజులు ఎక్కువ. ఈ రోగుల ఇమ్యూనిటీ బలహీనంగా ఉంటుంది కాబట్టి సులువుగా సోకుతుంది. సరిగ్గా అలాంటి మహిళకే కరోనా సోకిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆమె శరీరంలోని హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా మ్యూటేషన్లకు గురై ఒమిక్రాన్ గా మారిందన్నారు. ఈ మ్యూటేషన్ల వల్లే ఒమిక్రాన్ వ్యాప్తి సామర్థ్యం సాధించిందని చెప్పారు.

ఇక చైనాలోని పలు నగరాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. షియాన్ నగరంలో కొత్తగా 52కరోనా కేసులు రావడంతో అక్కడ లాక్ డౌన్ విధించింది. ప్రజలు బయటకు రావొద్దని ఆంక్షలు పెట్టడంతో 1.30కోట్ల మంది ఇళ్లకే పరిమితమయ్యారు. నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు రెండు రోజులకు ఒకసారి ఇంటికి ఒకరి చొప్పున బయటకు రావాలని షరతులు పెట్టింది. ఎమర్జెన్సీ తప్ప మిగతా సమయాల్లో బయటకు రావొద్దంది.

మన దేశంలో కూడా ఒమిక్రన్ కేసుల దృష్ట్యా ఢిల్లీలో క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై నిషేధం విధించారు. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా ఎలాంటి ఈవెంట్స్ జరగకుండా.. ప్రజలు గుమిగూడకుండా చూడాలని అధికారులను ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్
అథారిటీ ఆదేశించింది. అలాగే మాస్కులు లేని వాళ్లను కార్యాలయాలు, దుకాణాల్లోకి అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనూ వేడుకలపై నిషేధం విధించాలని డిమాండ్లు వస్తున్నాయి.







మరింత సమాచారం తెలుసుకోండి: