బలమైన నియోజకవర్గాన్ని తెలుగుదేశంపార్టీ చేజేతులారా చెడగొట్టుకుంటోంది. పార్టీ ఆవిర్భావం నుండి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీ ఐదుసార్లు గెలిచింది. క్యాడర్ పరంగా చూసుకున్నా బలమైన క్యాడరే ఉంది. అయితే మారిన పరిస్ధితుల్లో ఈ నియోజకవర్గం అనాధగా మారిపోయింది. అసలు ఈ నియోజకవర్గాన్ని చంద్రబాబునాయుడు ఎందుకు పట్టించుకోవటంలేదో కూడా అర్ధం కావటంలేదు.




మొన్నటి ఎన్నికల్లో ఇక్కడినుండి టీడీపీ తరపున పోటీచేసిన జేడీ రాజశేఖర్ ఓడిపోయారు. అప్పటినుండి రాజశేఖర్ పార్టీ కార్యక్రమాలను పెద్దగా పట్టించుకోవటంలేదు. అయితే అంతకుముందు ఎంఎల్ఏగా పోటీచేసి ఓడిపోయిన హేమలత బీజేపీలోకి వెళ్ళిపోయారు. తర్వాత అందులో ఇమడలేక మళ్ళీ టీడీపీలోకే వచ్చేశారు. రాజశేఖర్ స్ధానంలో హేమలత తన మద్దతుదారులతో యాక్టివ్ అయ్యారు.





ఇక్కడ విచిత్రమేమిటంటే హేమలతను చంద్రబాబు ఇన్చార్జిగా ప్రకటించలేదు. అలాగని రాజశేఖర్ ను కూడా ప్రకటించలేదు. దాంతో నియోజకవర్గంలో కొద్దిగా బలం ఉందన్న నేతల్లో చాలామంది ఎవరికి వారే తమను ఇన్చార్జిలుగా ప్రకటించేసుకుంటున్నారు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పార్టీ కార్యక్రమాలను చేసుకుపోతున్నారు. దీని ఫలితంగా ఏమవుతుందోంటే నేతల మధ్య, వాళ్ళ మద్దతుదారుల మధ్య రెగ్యులర్ గా గొడవలువుతునే ఉన్నాయి. అధిష్టానానికి ఒకళ్ళమీద మరొకళ్ళు ఫిర్యాదులు చేసుకుంటునే ఉన్నారు.




ఇంత జరుగుతున్నా నియోజకవర్గంలో ఏమి జరుగుతోందో చంద్రబాబు పట్టించుకోవటంలేదు. మొత్తానికి చంద్రబాబు వైఖరి కారణంగా అందరు ఉండికూడా నియోజకవర్గం అనాదగా మారిపోయింది. రేపు ఎన్నికలు వచ్చినా కూడా నేతలు, క్యాడర్ మధ్య ఐకమత్యం ఉంటుందని అనుకునేందుకు లేదు. ఒకపుడు  టీడీపీకి బలంగా ఉండే నియోజకవర్గం చివరకు ఇలాగ అయిపోయింది. దీనికి చంద్రబాబు మాత్రమే బాధ్యత వహించాల్సుంటుంది.




ఎందుకంటే బలమైన నియోజకవర్గాన్ని మరింతగా బలోపేతం చేయాల్సిందిపోయి అత్యంత బలహీనంగా మార్చేశారు. చంద్రబాబు చేతికి పార్టీ పగ్గాలు వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గమైనా సరే చాలా బలంగా తయారైందని, కంచుకోట లాగ మారిందని చెప్పుకునేందుకు కనీసం ఒక్క నియోజకవర్గం కూడా కనిపించటంలేదు. ఇపుడు చెప్పుకుంటున్న బలమైన, కంచుకోటలన్నీ ఎన్టీయార్ కారణంగా తయారైనవే.


మరింత సమాచారం తెలుసుకోండి: