అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య సక్యత ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.అదే నేతల మధ్య తగువచ్చిందా మధ్యలో ఉన్న వారికి చిత్తడి చిత్తడే. చింతలపూడిలోనూ అదే జరిగిందట. ఆ ఎపిసోడ్ వైసిపి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి, ఏలూరు లోక్ సభ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గం. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా ఇద్దరూ వైసీపీనే. కానీ ఒకరంటే ఒకరికి పడదన్నది బహిరంగం.

 గెలిచిన అప్పటినుండి ఇదే తంతు. ఒక్క మాటపై నడిచిన దాఖలాలు లేవంటారు పార్టీ నేతలు. ఈ క్రమంలో వస్తున్న సమస్యలపై చర్చగా మారి రచ్చరచ్చ అవుతున్నాయి. తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. ఈ చిచ్చుల బలైంది మాత్రం ప్రభుత్వ అధికారులు. జిల్లా మార్కెటింగ్ శాఖ ఏడి మహేంద్ర నాథ్, చింతలపూడి వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి మల్లయ్య లను సస్పెండ్ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కారణంగా ఇద్దరు అధికారులు సస్పెండ్ కావడంతో వీరి వర్గ పోరు మరోసారి చర్చకు వచ్చింది. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల కాలపరిమితి గత ఏడాది ఫిబ్రవరిలో పూర్తయింది. దీంతో ఆ కమిటీల పదవీకాలాన్నీ మరో ఏడాది పొడిగించారు. ఆ పొడగింపు ఉత్తర్వులను జిల్లా మార్కెటింగ్ ఏడి జిల్లాలోని అన్ని ఏఎంసీ లకు పంపించినా చింతలపూడి ఏఎంసీకి పంపించలేదట. అలా తొక్కిపెట్టిన విషయం పది నెలల తర్వాత  బయటపడడంతో ఇద్దరిపై వేటు తప్పలేదు. చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మందలపు సాయిబాబు కు ఎంపీ కోటగిరి శ్రీధర్ ఆశీస్సులు ఉన్నాయి. సాయిబాబుకు ఆ పదవి పొడగింపు రాకుండా చెక్ పెట్టాలని ఎమ్మెల్యే ఎలిజా భావించారట. చింతలపూడి ఏఎంసీ పదవీ ఖాళీగా ఉండిపోవడంతో పార్టీ నేతలకు ఆశ పుట్టింది.పార్టీ స్థానిక నేత జానకి రెడ్డి సీఎం జగన్ ను కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని కోరారట. వెంటనే సీఎంగా నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లడంతో వ్యవసాయ అధికారులు కంగుతిన్నంత పని అయింది.

అప్పటికే పొడిగింపు ఉత్తర్వులు ఇచ్చేసి ఉండడంతో ఖాళీ లేని ఏఎంసీ సీటులో కొత్త వ్యక్తిని ఎలా కూర్చో పెడతామని ఆరా తీశారట. ఇక్కడే కథ అనేక మలుపులు తిరిగి రాజకీయం రక్తి కట్టింది. మూడు నెలల్లో ముగిసిపోయే పదవికి ప్రమాణ స్వీకారం ఏంటా అని అక్కడికి వచ్చిన పార్టీ నేతలు ఆశ్చర్యపోయారట. సమస్య ముదిరి పై వరకు వెళితే చాలా మంది పీఠాలు కదులుతాయని భావించిన ఆఫీసర్లు వెంటనే ఏడి పైన మార్కెట్ కమిటీ కార్యదర్శి పైన వేటు వేశారు. ఎమ్మెల్యే, ఎంపీ మధ్య ఆధిపత్య పోరుకు ఇద్దరు అధికారులు బలైన విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి కథలు కథలుగా చెప్పుకొంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: