ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు చర్యలు వేగవంతం చేయాలని ప్రధాని మోడీ ఆదేశించారు. నలుగురు కేంద్రమంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మోడీ ఆదేశాలతో భారతీయులకు సహాయం చేసేందుకు జ్యోతిరాదిత్య సిందియా, హర్దీప్ సింగ్ పురి, కిరణ్ రిజిజు, వి.కె.సింగ్ ఉక్రెయిన్ సరిహద్దులకు వెళ్లనున్నారు. ఉక్రెయిన్ గగనతలం మూసివేతతో మనవాళ్లు పక్క దేశాలకు వెళ్తున్నారు. అక్కడి నుంచి విమానాల్లో ఇండియాకు వస్తున్నారు.

ఇక ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న చర్యలపై వివరాలు ఆపాలంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ లో నెలకొన్న పరిస్థితులు దృష్ట్యా విద్యార్థుల కుటుంబ సభ్యులు వారి కోసం తపించడం ఎంతో బాధ కలిగిస్తోందన్నారు. మన వారిని నిస్సహాయిలుగా వదిలేయడం సరికాదంటూ రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

మరోవైపు రష్యా యుద్ధం ప్రకటించడంతో ఉక్రెయిన్ వాసులు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని విదేశాలకు వెళ్తున్నారు. పోలండ్, హంగేరీ సహా సరిహద్దుల అవతల ఉన్న దేశాలకు వలస వెళ్తున్నారు. ఇప్పటి వరకు 3.7లక్షల మంది ఉక్రెయిన్ ను వీడి ఇతర దేశాలకు వెళ్లారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా.

ఇక ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ కారణంగా యూరప్ దేశాలు రక్షణ విధానాలపై దృష్టి సారించాయి. తాజాగా జర్మనీ సాయుధ దళాల బలోపేతం కోసం ఏకంగా 113 బిలియన్ డాలర్ల ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం ఇందుకు నిదర్శనం. దేశ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం కాపాడుకునేందుకు రక్షణ రంగంపై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందని జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ అభిప్రాయపడ్డారు.

అటు తమ దేశాన్ని కాపాడుకునేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడి నుంచి సామాన్య పౌరుల వరకు ప్రతి ఒక్కరూ ఆయుధాలు పట్టుకుంటున్నారు.వృద్ధులు, యువకులు, మహిళలు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఐటీ ఉద్యోగులు ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమయ్యారు. యుద్ధంలో పాల్గొనేందుకు వచ్చిన వారికి ఆయుధాలు ఇస్తామంటూ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేసిన ప్రకటనతో చాలామంది ముందుకొస్తున్నారు. రష్యా సైనికులు కీవ్ లోకి వస్తే చచ్చినట్టేనని హెచ్చరిస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: