ఏపీ కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి కేంద్రం వరుసగా కీలక పదవులతో బహుమతులు అందిస్తోంది . ఎన్డీఏ పాలనకు తిరిగి మద్దతుగా నిలిచిన టీడీపీకి ఇప్పుడు గౌరవప్రదమైన నియామకాలూ వరుసగా దక్కుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో రెండు మంత్రి పదవులు కట్టబెట్టిన కేంద్రం, తాజాగా సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గోవా గవర్నర్ గా నియమించి రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ ఇక్కడితో ఆగలేదు కథ.


విశ్వసనీయ సమాచారం ప్రకారం, టీడీపీకి మరో గవర్నర్ పదవిని కేటాయించేందుకు కేంద్ర బీజేపీ సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది . ఇక ఈసారి పదవి పైన బీసీ లేదా ఎస్సీ వర్గానికి చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబు సీరియస్‌గా ఆలోచిస్తున్నారని సమాచారం . అలాంటి సమయంలో తెర మీదకు వచ్చింది ఓ సీనియర్ నేత‌ పేరు – కేఈ కృష్ణమూర్తి. రాయలసీమకు చెందిన ఈ నేత గతంలో డిప్యూటీ సీఎం హోదాలో పని చేసి, పార్టీకి సేవలందించారు. ప్రస్తుతం  ఆయన రాజకీయంగా నిశ్శబ్దంలో ఉన్నా, గవర్నర్ పదవికి అనువైన అభ్యర్థిగా పేరు వినిపిస్తోంది. కానీ .. మరోవైపు ఆయన కుమారుడు కేఈ శ్యామ్‌బాబు ఇటీవలే ఎమ్మెల్యేగా గెలవడం ఈ సమీకరణాలను క్లిష్టం చేస్తోందని వర్గాల సమాచారం.


ఈ లోపు ఢిల్లీ వర్గాల నుంచి మరో వార్త – టీడీపీ నుంచి కేంద్ర స్థాయిలో నియామకాల కోసం నాయకుల జాబితా కోరినట్లు తెలుస్తోంది. ఇక దీని ఆధారంగా త్వరలో టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వ సంస్థల బోర్డులు, కమిషన్లలో కీలక స్థానాల్లో చేరే అవకాశం ఉంది. ఇంతకీ చంద్రబాబు మరో గవర్నర్ పదవికి ఎవరిని ఎంపిక చేస్తారు ? రాయలసీమ బీసీ నేతకా ? లేక పార్టీకి చిరకాలంగా సేవలందించిన వేరే సీనియర్‌కా ? ఈ ప్రశ్నకు సమాధానం త్వరలో రావొచ్చు. కానీ ఓ విషయం మాత్రం ఖాయం – మిషన్ 2029 లో భాగంగా ఎన్డీఏ – టీడీపీ బంధం బలపడుతుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి!

మరింత సమాచారం తెలుసుకోండి: