ఒకప్పుడు పొరుగు దేశంపై కుట్రలు పన్నడమే పనిగా పెట్టుకున్న పాకిస్తాన్ సైన్యం.. ఇప్పుడు సొంత దేశంలోనే బతకలేని దయనీయ స్థితికి దిగజారింది. ఆ దేశ సైన్యం ప్రస్తుతం చిగురుటాకులా వణికిపోతోంది. ఒకవైపు తాలిబన్ల ఉగ్రరూపానికి తల్లడిల్లుతుంటే, మరోవైపు బలూచ్ రెబల్స్ దెబ్బకు గడగడలాడిపోతోంది. ఈ రెండు శక్తుల మధ్య నలిగిపోతూ, ఆయుధాలు వదిలేసి పారిపోయేందుకు సిద్ధమవుతున్న వైనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

బలూచిస్తాన్... ఇప్పుడు ఈ పేరు చెబితేనే పాక్ సైనికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బలూచ్ స్వాతంత్ర్య సమరయోధులు పాక్ సైన్యంపై సింహస్వప్నంలా విరుచుకుపడుతున్నారు. సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం, పోలీసులను కాల్చి చంపడం, సైనికులను ఉరితీయడం వంటి ఘటనలతో బలూచిస్తాన్ అట్టుడుకుతోంది. ఫలితంగా, బలూచిస్తాన్‌లోని కీలక ప్రాంతాలు ఒక్కొక్కటిగా రెబల్స్ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి.

ఈ భయానక పరిస్థితుల్లో తాము విధులు నిర్వర్తించలేమంటూ వందలాది మంది సైనికులు, పోలీసులు చేతులెత్తేస్తున్నారు. సుమారు 500 మంది సైనిక, పోలీస్ సిబ్బంది తమను బలూచిస్తాన్ నుంచి వెంటనే బదిలీ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. "మేము బలూచ్ ఫైటర్స్‌తో యుద్ధం చేయలేం. ఈ రోజు మేము వారిపై దాడి చేస్తే, రేపు వాళ్ళు మా కుటుంబాలపై పడి ప్రాణాలు తీస్తారు. ఇది తుపాకులతో పరిష్కారమయ్యే సమస్య కాదు, రాజకీయంగా తేల్చుకోవాలి" అని వారు వాపోతున్న తీరు, పాక్ సైన్య నైతిక స్థైర్యం ఎంతగా పడిపోయిందో స్పష్టం చేస్తోంది.

బలూచిస్తాన్‌లో మొదలైన ఈ తిరుగుబాటు సెగ ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్‌కు కూడా పాకింది. అక్కడ కూడా పాక్ సైన్యంపై దాడులు పెరుగుతుండటంతో, పరిస్థితి చేయిదాటిపోతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. సొంత ప్రజల నుంచే ఇంతటి ప్రతిఘటన ఎదురవ్వడంతో, పాక్ సైన్యం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

నిజానికి, పాకిస్తాన్ సైన్యానికి యుద్ధ క్షేత్రం నుంచి పారిపోవడం కొత్తేమీ కాదనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. 1971లో భారత్ చేతిలో చావుదెబ్బ తిని, ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయిన చరిత్ర వారిది. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు శత్రువుల తూటాలు, మరోవైపు సొంత ప్రజల ఆగ్రహం.. ఓటమి మధ్య చిక్కుకున్న పాక్ సైన్యం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. వారి వీరత్వం కేవలం మాటలకే పరిమితమని మరోసారి రుజువవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: