భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి తరువాత అత్యున్నత స్థానమేమిటంటే అది ఉపరాష్ట్రపతి స్థానం. దేశ త్రివిధ దళాలకు అధిపతి అయిన రాష్ట్రపతికి వెంట , పెద్దల సభ రాజ్యసభకు చైర్మన్‌గా వ్యవహరించే ఉపరాష్ట్రపతికి ప్రోటోకాల్‌లో రెండో స్థానంలో ఉంటుంది. ఆర్టిక‌ల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించే ప్రక్రియను కూడా స్పష్టంగా వివరించారు. అలాంటి గౌరవనీయమైన, కీలకమైన పదవిని మధ్యలోనే వదిలిపెట్టడం… అదీ పూర్తిగా కాలం ముగియకముందే… దేశ చరిత్రలోనే అరుదైన సంఘటన. ఇప్పటి వరకు ఏ ఉపరాష్ట్రపతీ తన పదవీకాలాన్ని అర్ధాంతరంగా వదిలిపెట్టలేదు. కానీ జగదీప్ ధన్‌ఖడ్ మాత్రం ఆరోగ్య కారణాల్ని చూపుతూ రాజీనామా చేయడం, అది వెంటనే అమలులోకి వస్తుందంటూ ప్రకటించడం అనేక అనుమానాలకు తావిచ్చింది.
 

ఇక ఆయన పదవీకాలం ఇంకా రెండేళ్ల పాటు మిగిలి ఉండగా ఇలా మధ్యలో వెళ్లిపోవడం వెనుక నిజంగానే ఆరోగ్య కారణమేనా ? లేక రాజకీయ వ్యూహమా ? అనే ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. నిజంగా అనారోగ్యం కారణమైతే, ఉపరాష్ట్రపతిగా ఉన్న స్థాయిలో ఆయనకు అత్యుత్తమ వైద్యం దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ లభిస్తుంది. గతంలో కృష్ణకాంత్ ఉదాహరణగా తీసుకుంటే, ఆయన ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడు అనారోగ్యంతో బాధపడినా, విదేశాల్లోనూ, దేశంలోనూ అత్యుత్తమ వైద్యం అందించారు. ఆయనను ఏ దశలోనూ రాజీనామాకు పిలవలేదు. ఈ కారణంగా, ధన్‌ఖడ్ వైద్యం అందుకోలేరన్న వాదనలో నిజంలేదు.



ఇంకో కోణంలో చూస్తే - ఉపరాష్ట్రపతి పని ఒత్తిడిగా చెప్పలేం. సభల సీజన్‌ కాకపోతే నెలల తరబడి సెలవులు లభిస్తాయి. ఇంకా, సభలు జరిగే సమయంలోనూ కో చైర్మన్‌లు, సభాపతులు వ్యవహరించగలుగుతారు. ఈ రెండు అంశాలను పక్కన పెడితే, బలంగా మిగిలేది రాజకీయ కోణమే.ఈ ఏడాది జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా బీజేపీ పూర్తి స్థాయి వ్యూహాలను అమలు చేస్తోంది. ఇప్పటికే ఉచిత పథకాల ప్రకటనలు, మహిళలకు రిజర్వేషన్ల హామీలు వంటి చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మరొక అడుగు ముందుకేసి, బీహార్‌కు చెందిన నాయకుడిని ఉపరాష్ట్రపతి పదవిలోకి తీసుకురావాలన్న వ్యూహం తెర వెనుక నడుస్తోందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిద్వారా బీహార్‌లో ఓటు బ్యాంకును మరింతగా ఆకర్షించాలన్నదే లక్ష్యంగా ఉందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.



ఇంకొక ఆసక్తికరమైన కోణం - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివాసీ మహిళ. ఆమెను పదవీ త్యాగం చేయమని అడగడం రాజకీయంగా రిస్క్ కావచ్చు. పైగా, ఆమె సెంటిమెంట్ కూడా దేశవ్యాప్తంగా ఉండటంతో, ఆ దిశగా కేంద్రం వెళ్లదని అర్థమవుతోంది. దీంతో బలహీనంగా కనిపించిన ఉపరాష్ట్రపతి పదవిలో మార్పు చేయడమే తాత్కాలిక ప్లాన్ అయి ఉండవచ్చునని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతిమంగా, ధన్‌ఖడ్ రాజీనామా వెనుక నిజమైన కారణం ఏదైనా కావొచ్చు. కానీ రాజకీయ లెక్కలు కలిపి చూసుకుంటే, ఇది బీహార్ ఎన్నికల వ్యూహానికి భాగంగా కనిపించక మానదు. మున్ముందు ఆ స్థానంలో ఎవరు వస్తారు ? బీహార్ నేతకే అవకాశం ఇస్తారా ? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చ.

మరింత సమాచారం తెలుసుకోండి: