
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సినీ రంగం ప్రభావం ఎప్పుడూ చర్చనీయాంశమే. ముఖ్యంగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సమయంలో ఈ చర్చ మరింత పదునెక్కుతోంది. తాజాగా, పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ వేళ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి నుంచి కీలక ఆదేశాలు వెలువడినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాపై ఎటువంటి నెగెటివ్ వ్యాఖ్యలు చేయవద్దని, సోషల్ మీడియాలో గానీ, బహిరంగంగా గానీ విమర్శలు చేయరాదని జగన్ పార్టీ నేతలకు స్పష్టమైన సూచనలు ఇచ్చినట్లు సమాచారం.
సాధారణంగా, పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే, రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా వైసీపీ శ్రేణుల్లో విమర్శలు, వ్యతిరేక ప్రచారాలు షురూ అయ్యేవి. ఆయన సినిమాలను పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా టార్గెట్ చేయడం గతంలో చూశాం. జగన్ ఈ ప్రకటన చేయడానికి ముందే కొందరు వైసీపీ నేతలు వీరమల్లు సినిమాపై నెగటివ్ కామెంట్లు చేశారు. ఈసారి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీని వెనుక కొన్ని వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమాలపై ప్రతికూల ప్రచారం చేయడం ద్వారా ఆయనకు అనవసరమైన సానుభూతి లభించే అవకాశం ఉందని వైసీపీ అధిష్టానం గుర్తించినట్లు సమాచారం.
గతంలో జరిగిన కొన్ని పరిణామాలు ఈ విషయాన్ని రుజువు చేశాయి. కొన్ని సినిమాల విడుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పుడు, అది పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా మరింత మైలేజ్ ఇచ్చిందని వైసీపీ వర్గాలు గుర్తించాయి. గత ఎన్నికల్లోనూ జగన్ పవన్ వ్యక్తిగత , కుటుంబ విషయానలు పదే పదే ప్రస్తావించడం ద్వారా పార్టీకి కొన్ని వర్గాలు దూరమయ్యాయన్న విషయాన్ని జగన్ ఎన్నికల ఫలితాల తర్వాత గుర్తించారు. అందుకే ఇప్పుడు జగన్ పవన్ సినిమాల విషయంలో నెగటివ్ కామెంట్లు వద్దని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు