
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం నియోజకవర్గం అంటే నందమూరి కుటుంబానికి కంచుకోట లాంటి స్థానం. 2014లో తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన బాలకృష్ణ, అప్పటి నుంచి వరుస విజయాలతో తన సత్తా చాటుతూ ఈ నియోజకవర్గాన్ని టీడీపీకి పూర్తిగా ఓన్ అయ్యేలా చేశారు. బాలకృష్ణ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్న నేపథ్యంలో నియోజకవర్గంలో ఆయన కచ్చితంగా అందుబాటులో ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీనిని అధిగమించేందుకు ఆయన పీఏలను నియమిస్తూ వచ్చారు. కొన్నిసార్లు ఈ పీఏల శైలిపై విమర్శలు వచ్చాయి. ప్రజలతో సమన్వయం లేకపోవడం, సమస్యలపై స్పందించకపోవడం వంటి ఘటనలు ప్రజల్లో అసంతృప్తికి దారి తీశాయి. ఇటీవల హిందూపురంలో "ఎమ్మెల్యే అందుబాటులో లేరు" అన్న పదాలతో ఫ్లెక్సీలు దర్శనమిచ్చిన నేపథ్యంలో వైసీపీ వాళ్లు దీనిని బాగా హైలెట్ చేస్తూ వస్తుండడంతో రాజకీయంగా హిందూపురం వేడి పుంజుకుంది.
ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ ప్రత్యక్షంగా రంగంలోకి దిగలేని పరిస్థితుల్లో ఆయన సతీమణి వసుంధర దేవిని రంగంలోకి దించారు. గత ఎన్నికల సమయంలోనే వసుంధర దేవి హిందూపురం ప్రజల మధ్యకు వచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉచిత సంచార వైద్యశాలలు, ఐదు రూపాయలకే భోజనం అందించే క్యాంటీన్లు, పశు వైద్య సేవలు ఆమె ఆధ్వర్యంలోనే ప్రారంభించారు. పేద కుటుంబాల పిల్లలను ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చదివిస్తూ వస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో వసుంధర దేవి నాలుగు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు స్వయంగా విన్నారు. మహిళలకు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని పసుపు కుంకుమ పంపిణీ చేయడం, ప్రజలతో సాన్నిహిత్యం పెంచే కార్యక్రమాలను చేపట్టారు.
ఇక హిందూపురాన్ని కేంద్రంగా సత్యసాయి జిల్లా ఏర్పాటు కావాలన్న డిమాండ్‌ను కూడా ఆమె ప్రస్తావించడం, నాయకులతో చర్చించడం ద్వారా ఆమె రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం హిందూపురంలో మారుతున్న రాజకీయ వాతావరణంలో వసుంధర దేవి నాయకత్వం, ఆమె కార్యక్రమాలు, ప్రజలతో నేరుగా మమేకం కావడం పార్టీకి, బాలయ్యకు చాలా ప్లస్ అవుతోంది. హిందూపురంలో నందమూరి కుటుంబానికి ఉన్న ప్రజాదరణ కొనసాగేందుకు వసుంధర దేవి కీలక భూమిక పోషిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు