
2019లో రాష్ట్రం అంతటా వైసీపీ ప్రభంజన విజయం సాధించినా, హిందూపురంలో మాత్రం ఘోర పరాజయం తప్పించుకోలేకపోయింది. ఇక్కడి వైసీపీకి మొదటి నుంచి వర్గపోరు మైనస్ అయ్యింది. కాంగ్రెస్‌లో ఉన్న నవీన్ నిశ్చల్ వైసీపీలో చేరి 2014లో బాలకృష్ణపై పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల సమయంలో మాజీ పోలీసు అధికారి ఇక్బాల్‌ను ముందుకు తెచ్చి పోటీ చేయించారు. ఆయన రాగానే వర్గపోరు మరింతగా ముదిరింది. ఒకవైపు నవీన్ వర్గం, మరోవైపు ఇక్బాల్ వర్గం, అదే సమయంలో హత్యకు గురైన చౌడూరు రామకృష్ణారెడ్డి వర్గం ఇలా మూడు ముక్కలాట నడిచింది.
2024 ఎన్నికల సమయానికి ఇక్బాల్ పార్టీని వీడగా, ఇన్‌చార్జ్‌గా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కురుబ దీపికను రంగంలోకి దించారు. కానీ, ఈ మార్పు కూడా ఫలించలేదు. బాలకృష్ణ మరోసారి ఘన విజయం సాధించగా, వైసీపీ మూడోసారి వరుసగా ఓడిపోయింది. ఓటమి తర్వాత కూడా వర్గపోరు తగ్గకపోవడం పరిస్థితిని మరింత దారుణంగా మార్చింది. దీపిక అధిష్టానంకు ఫిర్యాదు చేయడంతో పార్టీ నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిలను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఫలితంగా, ఆ వర్గానికి భవిష్యత్తు ఏ దిశలో ఉండబోతుందో అనిశ్చితి నెలకొంది. మరోవైపు, దీపిక పార్టీ కేడర్‌ను ఏకతాటిపైకి తేనికి ప్రయత్నించినా ఫలితం రాలేదు. ఓవరాల్‌గా బాలయ్య ఇలాకాలో వైసీపీ మూడు గ్రూపులు.. ఆరు గొడవలు అన్న చందంగా నడుస్తోంది.