
ఇతర నియోజకవర్గాల నుంచి టిడిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పులివెందుకు చేరి పరిస్థితిని తమవైపు మలచుకున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు, వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డిని సైతం ఇంటి బయటకు రాకుండా అడ్డుకోవటం, వైసీపీకి ఉన్న ఇబ్బందులు ఏ స్థాయిలో ఉన్నాయో చూపిస్తోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన దగ్గర నుంచే టిడిపి గట్టిగా రంగంలోకి దిగి అరాచకానికి తెరలేపిందని వైసీపీ ఆరోపిస్తోంది. ఒక దశలో వైసీపీ ఎన్నికల బహిష్కరణపై ఆలోచించిందనే మాటలు వినిపించాయి. కానీ జగన్ వ్యూహాత్మకంగా ముందడుగు వేసి, తన సొంత నియోజకవర్గం కావడంతో పార్టీ అభ్యర్థిని పోటీలో ఉంచారు.ప్రచార సమయంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌తో పాటు పలువురు నాయకులపై దాడులు జరిగాయి.
అయినప్పటికీ వైసీపీ వెనక్కి తగ్గకుండా బరిలో నిలిచింది. కానీ బూత్‌ల వద్ద జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే పరిస్థితి మరింత విషమంగా ఉందనిపిస్తోంది. 10 నెలల పదవీకాలం ఉన్న జెడ్పిటిసి కోసం ఇంతటి హడావుడి, ఇంతటి రాజకీయ దౌర్జన్యం అవసరమా అనే ప్రశ్నలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఇక మరోవైపు, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు ఈడ్చికెళ్లడం, టిడిపి అనుచరులు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్ చేయడం వంటి ఆరోపణలు వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి. మొత్తానికి, ఈ ఉప ఎన్నికల్లో టిడిపి "వైసీపీని పులివెందులో ఓడించాం" అని చెప్పుకోవటానికి ఎంత కష్టమైనా వెనకాడట్లేదనే భావన కలుగుతోంది. పోలింగ్‌కు ముందు జరుగుతున్న ఈ సంఘటనలు చూస్తే, వైసీపీ ముందే ఓటమి వాసనను గమనించిందా అన్న ప్రశ్న తప్పకుండా తలెత్తుతోంది.