
ఆయనకు ఉన్న పాత పరిచయాలు, గతంలో ఉన్నతాధికారులకు కల్పించిన సౌకర్యాలు, మేళ్లు… ఇవన్నీ ఇప్పుడు అధికారులను కూటమి ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా, ఆ నేత మాటే వినేలా చేస్తున్నాయని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీ పాలనలో నియమించిన అధికారులను కొత్త ప్రభుత్వం అనేక శాఖల నుంచి మార్చినా, చిత్తూరులో మాత్రం ఆ మార్పులు జరగలేదు. కారణం ఆ సీనియర్ నేత ఒత్తిడి అంటున్నారు. ఇది మరీ ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిధిలోని శాఖకు సంబంధించినదే కావడం గమనార్హం.
పవన్ కళ్యాణ్, ఆ వైసీపీ నేత మధ్య పాత వైరం ఉన్నా ఆయన ఆదేశాలు జిల్లాలో అమలుకావడం లేదు. చిత్తూరు జిల్లాలో అటవీ భూభాగం విస్తారంగా ఉండటం, ఎర్రచందనం అక్రమ రవాణాకు ఈ ప్రాంతం పేరుపొందడం వల్ల గతంలోనూ, ఇప్పుడూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఆరు నెలల క్రితమే కీలక అధికారులను మార్చాలని నిర్ణయించినా, చిత్తూరులో ఉన్నతాధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టారు. దీనికి కారణం వైసీపీ సీనియర్ నేత ప్రభావమేనని కూటమి వర్గాలు ఆరోపిస్తున్నాయి. పై నుంచి కింది స్థాయి వరకు పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది అందరూ ఆ నేత కనుసన్నల్లోనే నడుస్తున్నారని సమాచారం. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వంలోనూ ఆ వైసీపీ నేత తన పవర్ చూపిస్తున్నారన్న టాక్ బాగా నడుస్తోంది.