టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఎన్ని సార్లు హెచ్చరించినా.. తన ఎమ్మెల్యేల తీరుతెన్నులు మాత్రం మారడంలేదు. "ఇంకెప్పుడూ ఇలా చేయకండి" అని చెప్పినా.. ఒక్కోసారి ఒక్కో వివాదంతో పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ వస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడు నెలల్లోనే ఉచిత ఇసుక వ్యవహారం దుమారం రేపింది. రాజధానికి కూడా ఇసుక సరఫరా కావాలంటే కమీషన్లు కావాలని పట్టుబట్టిన ఎమ్మెల్యేలు బయటపడటంతో, ప్రజల్లో తీవ్ర విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత మద్యం వ్యాపారంలోనూ అదే తంతు. లాబీయింగులు, డబ్బులు, కమీషన్లతో వ్యవహారం దారుణంగా దూసుకెళ్లింది. ఈ పరిణామాలపై అప్పట్లో అనుకూల మీడియా కూడా మౌనం వహించలేకపోయింది. తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. కానీ "ఇది సామూహిక ఆరోపణ" అని వదిలేసి, వారిని కఠినంగా క్లాస్ చేయడమే పరిమితమయ్యారు. అయితే ఆ తర్వాత తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తన తెరమీదకొచ్చింది. ప్రభుత్వంపైనే రెచ్చిపోవడం, మీడియా ముందు మాటలు జారేయడం వంటి పనులు పార్టీకి తలనొప్పి తెచ్చాయి. పలుమార్లు ఆయనకు క్లాస్ ఇచ్చినా ఫలితం లేకపోయింది.


ఇదే ట్రాక్‌లో తర్వాత మరికొందరు ఎమ్మెల్యేలు అడుగులు వేసినట్లు అయింది. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ, గుంటూరులో మరికొందరి పేర్లు కూడా చర్చకు వచ్చాయి. వీటన్నీ రాజకీయంగా ఎదుర్కోవచ్చని భావించి చంద్రబాబు సర్దుకుపోయారు. కానీ తాజా పరిణామాలు మాత్రం పార్టీకి మరింత ఇబ్బందులు తెచ్చాయి. ఒక ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌పై బూతులు తిట్టిన ఆడియో బయటపడటంతో, వైసీపీ దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది. టీడీపీ–నందమూరి బంధం పై ప్రజల్లో సందేహాలు కలిగించడమే కాకుండా, కూటమి ప్రతిష్టకు గట్టి దెబ్బ తగిలింది. అంతలోనే గుంటూరుకు చెందిన మరో ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే ఫోన్‌లోనే రాసలీలలు జరిపారంటూ వీడియోలు బయటకు రావడంతో ఆ దుమారం వేరే లెవల్‌కు వెళ్లింది. ఎంత తప్పించుకోవాలని ప్రయత్నించినా, పక్కా లెక్కలతో బయట పడిపోవడంతో పార్టీ రక్షణ కష్టమైంది.



ఇంతకీ అంతకే ఆగిపోలేదు. సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవి కుమార్ కూడా అదే బాటలో నడిచారు. ఓ టీచర్‌ను బెదిరించారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో పార్టీ ప్రతిష్ట ఒక్కసారిగా తలకిందులయ్యే స్థితికి చేరింది. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తున్న చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట. ఇకపై ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని గట్టిగా హెచ్చరించారు.అసలు చూడటానికి ఒక్కో ఎమ్మెల్యే తప్పు చేసినా, దాని భారం మాత్రం మొత్తం పార్టీకే పడుతోంది. బాబు ఎంత కష్టపడినా, ఈ తరహా వ్యవహారాలు కూటమి ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నాయి. "ఇక భరించలేం.. తప్పక కఠిన చర్యలు తీసుకోవాలి" అన్న స్థాయికి చంద్రబాబు వెళ్లిపోయారట. కానీ ఇప్పటికీ ఆ నిర్ణయాలు అమలవుతాయా లేదా అనేది మిలియన్ డాలర్ ప్రశ్న. అప్పటివరకు మాత్రం.. టీడీపీ ఎమ్మెల్యేల రచ్చ వల్ల చంద్రబాబు ఇబ్బందుల్లోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: