ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నేటి నుంచి ప్రారంభమవుతున్న వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రాజకీయ చర్చలకు హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రతిపక్షం (ప్రధాన ప్రతిపక్షం కాదు) వైసీపీ తరఫున ఎన్నికైన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరుకావాలా లేదా? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఇటు ప్రభుత్వ పార్టీ నుంచి సవాళ్లు, అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు నుంచి విజ్ఞప్తులు రావడంతో, వైసీపీ అధినేత జగన్ తన మొదటి నిర్ణయంపై కొంత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇటీవల వరకు "ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని" కఠినంగా చెప్పిన జగన్, ప్రజలలో వస్తున్న ప్రతికూల వాతావరణం, అసెంబ్లీలో హాజరుకాకపోతే గ్రాఫ్ మరింత పడిపోతుందనే అంచనాల మధ్య తన వ్యూహంలో మార్పులు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
 

ముఖ్యంగా, రైతుల సమస్యలు, ప్రజల ఇబ్బందులు వంటి అంశాలను బయట ఎంత చెప్పినా అసెంబ్లీ వేదికలో చెప్పకపోతే ఉపయోగం ఉండదన్న అభిప్రాయం వైసీపీ లోపల పెరిగింది. దీని ఫలితంగానే జగన్, కొంతమంది కీలక ఎమ్మెల్యేలకి సభకు హాజరు కావాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొదటి విడతలో నలుగురు ఎమ్మెల్యేలునే అసెంబ్లీకి హాజరుకానున్నారు. వీరిలో పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – ఈ నలుగురూ ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశమైన వారే. పెద్దిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారన్న ప్రచారం సాగింది. దాసరి సుధ జనసేన తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వచ్చినా, ఆమె ఖండించారు.

 

మత్స్యలింగం ఇటీవల దూకుడుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలనాగిరెడ్డి అయితే "గెలిచింది ఇంట్లో కూర్చునేందుకేనా?" అంటూ సోంత పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇలాంటి కాంబినేషన్‌లో వారిని అసెంబ్లీకి పంపించడం వెనుక జగన్ వ్యూహం ఏమిటో అనే చర్చ మొదలైంది. మరోవైపు ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సమావేశంలో మరికొందరికి అనుమతి ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జగన్ మాత్రం అసెంబ్లీకి దూరంగానే ఉండనున్నారు.ఇక మొత్తానికి చెప్పుకోవాల్సి వస్తే, అసెంబ్లీ బహిష్కరణపై వస్తున్న విమర్శలకు జగన్ కొంత వెనక్కి తగ్గడం స్పష్టమవుతోంది. అసెంబ్లీ వేదికలో సమస్యలు చెప్పకుండా బయటే గొడవపడితే ప్రజలు నమ్మరని వైసీపీ లోపలే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే వ్యూహంలో ఈ మార్పు. కానీ ఇది పార్టీ ఇమేజ్‌కి ఎంతవరకు ప్లస్ అవుతుందో, లేక మళ్లీ మైనస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: