తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళా క్రికెట్ జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనల వర్షం కురుస్తోంది.  ముఖ్యంగా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా భారత మహిళా జట్టును అభినందిస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీసింది. మమతా బెనర్జీ తన అధికారిక ఎక్స్  అకౌంట్‌లో చేసిన పోస్టులో, “ఈ రోజు ప్రపంచకప్ ఫైనల్లో ఘన విజయం సాధించిన మా ‘ఉమెన్ ఇన్ బ్లూ’ని చూసి దేశమంతా గర్విస్తోంది. మీరు టోర్నమెంట్ మొత్తం అద్భుత ప్రతిభ చూపి, అత్యున్నత స్థాయి ప్రదర్శనతో దేశానికి గౌరవం తెచ్చారు. మీ పోరాటం, పట్టుదల, జట్టు స్పూర్తి తరతరాలకు ప్రేరణగా నిలుస్తుంది. మీరు కేవలం క్రీడాకారిణులు మాత్రమే కాదు, ప్రతి భారత యువతికి మార్గదర్శకులు. మీ ధైర్యం, శ్రమ, క్రమశిక్షణ మనమందరికీ గర్వకారణం. మీరు మాకు అనేక ఆనంద క్షణాలను అందించారు. మీరే మా నిజమైన హీరోలు. భవిష్యత్తులో మరిన్ని విశేష విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. మేమంతా మీకు అండగా ఉంటాం” అని పేర్కొన్నారు.


మమతా బెనర్జీ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. పలు మంది నెటిజన్లు ఆమె అభినందనలను మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రీడా ప్రపంచం నుంచి కూడా ఆమె ట్వీట్‌పై స్పందనలు వస్తున్నాయి. చాలా మంది ఆమె “మహిళా శక్తి”పై చేసిన వ్యాఖ్యలను ప్రశంసిస్తూ, “మమతా గారు ఎప్పుడూ మహిళా సాధికారతకు మద్దతుగా నిలుస్తారు” అని రాస్తున్నారు. అయితే, ఇదే ట్వీట్ ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంది. గతంలో మమతా బెనర్జీ చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, బీజేపీ ఆమెను ఎద్దేవా చేస్తోంది. ముఖ్యంగా, 2024 అక్టోబర్లో దుర్గాపూర్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై మమతా చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అప్పుడు మమతా బెనర్జీ మాట్లాడుతూ, “రాత్రి 12.30 గంటలకు బయటకు ఎందుకు వచ్చింది ఆ అమ్మాయి?” అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. “ఆడపిల్లలు రాత్రిపూట బయటకు వెళ్లకూడదు. వారు తమ సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి” అని ఆమె చెప్పడం ఆ సమయంలో తీవ్ర విమర్శలకు గురైంది.



ఆ వ్యాఖ్యలతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఆమెపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. “మహిళా భద్రతను కాపాడాల్సిన ముఖ్యమంత్రి బాధితురాలిని నిందించడం సరికాదని” పలు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలనే బీజేపీ మరోసారి తెరపైకి తెచ్చింది.వెస్ట్ బెంగాల్ బీజేపీ తమ అధికారిక ఎక్స్ అకౌంట్‌లో ఒక ట్వీట్ చేస్తూ, “దేవుడా… వాళ్లు రాత్రి 12 గంటల వరకు ఆడారు. కానీ మీరు ఆడపిల్లలు 8 గంటలకే ఇంట్లో ఉండాలని చెప్పారుగా?” అని వ్యాఖ్యానించింది. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారి తీసింది. మమతా బెనర్జీని వ్యంగ్యంగా టార్గెట్ చేస్తూ బీజేపీ ఆమె గత వ్యాఖ్యలను గుర్తు చేసింది.







మరింత సమాచారం తెలుసుకోండి: