- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణ రాజ‌ధాని గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామ‌ని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. సోమవారం రాత్రి ఈవీఎంలు కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి పోలింగ్ స్టేషన్లకు తరలిస్తామన్నారు. ఈ సారి ఒక్కో పోలింగ్ స్టేష‌న్‌లో మొత్తం 4 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయ‌ని చెప్పారు. మొత్తం 139 పోలింగ్ లొకేషన్స్‌లో 407 పోలింగ్ బూత్‌‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్ర‌తి బూత్ ద‌గ్గ‌ర మూడెంచ‌ల భ‌ద్ర‌త ఉంటుంద‌న్నారు. 45FST, 45SST టీమ్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నాయని వెల్లడించారు.పోలింగ్ కేంద్రాల్లో 2,060 మంది సిబ్బంది విధుల్లో ఉండ‌నున్నారు. ఈ మేరకు 561 కంట్రోల్ యూనిట్లు , 595 వీవీ ప్యాట్లు , 2,394 బ్యాలెట్ యూనిట్లు అందుబాటులో ఉంటాయన్నారు. పోలింగ్ స్టేష‌న్ నుంచి వెబ్ కాస్టింగ్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంద‌న్నారు.


ఇక పోలింగ్ స్టేష‌న్ వ‌ద్ద హెల్ఫ్ డెస్కుల‌తో పాటు మొబైల్ డిపాజిట్ కౌంట‌ర్లు కూడా ఏర్పాటు చేస్తున్న‌ట్టు తెలిపారు. ఓట‌ర్ల కోసం ఎన్ సీసీ వాలంటీర్లు కూడా ప‌ని చేస్తార‌ని తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ అంతా డ్రోన్ల ద్వారా మానిట‌రింగ్ చేస్తామ‌న్నారు. ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపే అంశంపై కూడా ఇప్ప‌టికే ఆర్బీఐ తో చ‌ర్చించనున్న‌ట్టు క‌ర్ణ‌న్ తెలిపారు.  ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్స్‌‌పై ఆర్బీఐ ప్ర‌త్యేక నిఘా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆదివారం నుంచి 11వ తేదీ సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయిస్తామ‌న్నారు.


ఉపఎన్నిక నేపథ్యంలో ఓటర్లందరూ ముందుకు వచ్చి ఓటు వినియోగించుకోవాలని కర్ణన్ నియోజ‌క‌వ‌ర్గం లోని ఓట‌ర్ల కు విజ్ఞప్తి చేశారు.అనంతరం జాయింట్ సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్ మాట్లాడుతూ.. 65 లొకేషన్స్‌లో 226 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఇప్ప‌టికే గుర్తించామ‌ని తెలిపారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద పారామిలిటరీ బలగాల బందోబస్తు ఉంటుందని తెలిపారు. ఇక అన్ని పోలింగ్ స్టేషన్ల వద్ద పోలీసుల బందోబస్తు ఉంటుందని . . ఎన్నికల నిబంధన ఉల్లంఘన కేసులు 27 నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటి వరకు రూ. 3 కోట్ల 60 లక్షల నగదు పట్టుకున్నట్లు వెల్లడించారు. 230 మంది రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసినట్లు సీపీ తఫ్సీర్‌ ఇక్బాల్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: