భారత దేశంలో రైతులకు కొన్ని జంతువుల వల్ల, పక్షుల వల్ల చేతికి వచ్చిన పంట నాశనం అవుతుంటాయి..ముఖ్యంగా ఏనుగులు, అడవి పందులు ఒకోసారి నెమళ్ల వల్ల కూడా పంట పొలాలు నాశనం చేస్తుంటాయి. వీటిని ఎదుర్కోవడానికి ఒకోసారి కరెంట్ వైర్లు పెడుతుంటారు రైతులు కానీ వాటి వల్ల వారికే ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా జాతీయ పక్షి నెమలి, రాష్ట్ర జంతువు అడవి దున్నను పీడ కలిగించే జంతువుల జాబితాలో చేర్చాలని శుక్రవారం గోవా ప్రభుత్వం ప్రతిపాదించింది.

 అడవి పంది, కోతి, అడవి దున్న(గౌర్‌), నెమలి వంటి జాతులను హానీ కలిగించే జాతుల జాబితాలోకి చేర్చారు.ఈ జాబితాలోని జంతువులు గ్రామీణ ప్రాంతాల్లో పంటలను నాశనం చేస్తూ, రైతులకు ఇబ్బందులను కలిగిస్తున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి రమేష్‌ తవాడ్కర్‌ తెలిపారు.  పంట పొలాలను నెమళ్లు నాశనం చేస్తున్నాయని రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రైతులతో సమావేశానంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1లో నెమళ్లను రక్షించాలని పేర్కొనడం జరిగింది. అయితే నెమళ్లను ఆ జాబితాలో చేర్చడం దారుణమంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తెలిపారు. ఇది కాస్త చిలికి చిలికి గాలివాన కావడంతో.. ఆ రాష్ట్ర సీఎం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ... నెమలి వెర్మిన్ జాబితాలో ఉందని తాననుకోవడం లేదని, అది మన జాతీయ పక్షి అని, దాన్నెలా పంటలకు హాని కలిగించే జాబితాలో చేరుస్తామని ప్రశ్నించారు.

పంటపోలాల్లో ధాన్యాలు తినడానికి మాత్రమే అవి వస్తాయని, పంటను పాడు చేయవని లక్ష్మీకాంత్ తెలిపారు.  ఒకవేళ ఫిర్యాదులు వస్తే నియంత్రించేందుకు తగుచర్యలు తీసుకుంటామని పర్సేకర్ చెప్పుకొచ్చారు. నెమలిని హాని కలిగించే జాతుల జాబితాలో గోవా సర్కారు చేర్చిందనే వార్తల్లో నిజం లేదని పర్సేకర్ వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: