హిందూ సాంప్రదాయం ప్రకారం దేవుడికి పూజ చేసిన తర్వాత చివరలో కొబ్బరికాయ కొట్టడం ఆనవాయితీ. మరియు శుభకార్యాలు మొదలెట్టాలన్నా కొబ్బరికాయ కొట్టడం తప్పనిసరి.చాలామంది తమ కోరిక నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతామని లేక వారికి నచ్చిన సంఖ్యలో కొబ్బరికాయలు కొడతామని మొక్కుకుంటారు. ఆ కోరికలు నెరవేరిన తర్వాత కచ్చితంగా మొక్కును నెరవేర్చుకుంటారు. కొబ్బరికాయ దేవుడికి సమర్పించడంలో నిజం ఏంటంటే,టెంకాయని దేవుడికి సమర్పించడంతో మనలో ఉన్న అహంకారం తగ్గిపోయి, మనసు స్వచ్ఛంగా మారుతుందని అర్థమట. టెంకాయ మీద ఉన్న పెంకు అహంకారానికి ప్రతిరూపం.దానిని పగల కొట్టినప్పుడు మన మనసులో ఉన్న అహంకారం పటాపంచలవుతుందని అర్థం. కొబ్బరి చిప్పలు దేవుడు నివేదించడం వల్ల,స్వచ్ఛమైన కొబ్బరి వలె మన మనసును నివేదించడం వంటిదే. అందులోని కొబ్బరి నీళ్ళు మనసు నిర్మలత్వానికి ప్రతీక. వీటన్నిటికీ ప్రతికగా దేవునికి టెంకాయలు సమర్పించుకుంటామని పెద్దలు సూచిస్తున్నారు.

 టెంకాయలో పువ్వువస్తే మంచి జరుగుతుందా..?
పూజల్లో కొబ్బరికాయను భగవంతునికి సమర్పించినప్పుడు,ఒక్కోసారీ టెంకాయలో పువ్వు వస్తూ ఉంటుంది. ఇలా పువ్వు వస్తే చాలామంది అదృష్టంగా భావిస్తారు.వారి కోరికలు దేవుడు విన్నాడని ప్రగాఢ విశ్వాసంగా ఉంటారు. కానీ టెంకాయలో పువ్వు రావడంతోనే మనకు అదృష్టం కలిగి, స్థితిగతులు మారుతాయని భావించడం ఒక అపోహ మాత్రమే. కేవలం మనం భగవంతున్ని భక్తితో, నమ్మకంతో మాత్రమే పూజిస్తే,ఆ భగవంతుడే మనకు కావాల్సినవన్నీ ప్రసాదిస్తాడని వేద పండితులు చెబుతున్నారు.

టెంకాయ కుళ్ళిపోయినప్పుడు చెడు జరుగుతుందా..?
టెంకాయను దేవుడి ముందు కొట్టినప్పుడు ఒక్కొక్కసారి చెడిపోయి ఉంటుంది. దానివల్ల ఏదో మన ఇంట్లో కీడు జరుగుతుందని శంకిస్తూ ఉంటారు. కానీ టెంకాయ కొన్ని కారణాలవల్ల చెడిపోవడమే తప్పా,మన స్థితిగతులను మార్చదని, అవన్నీ వట్టి అపోహలేనని పెద్దలు చెబుతున్నారు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పట్టింపులు ఉండి, ఇలా జరిగిందేమిటి అని బాధపడుతూ ఉంటే, అలాంటివారు మరొకసారి తలస్నానం చేసి,దేవుడి యందు మనసు లగ్నం చేసి పూజిస్తే,మంచి ఫలితాలు ఉంటాయని  నివారణ చర్యలను సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: