
అవును ఇపుడిదే అంశంపై ఇంటా బయట కూడా చర్చ మొదలైంది. ఇంతకీ విషయం ఏమిటంటే సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులను ఆమోదిస్తు గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ సంతకం చేసేశారు. గవర్నర్ చర్యను నిరసిస్తు టిడిపి ఎంఎల్సీ బిటెక్ రవి తన పదవికి రాజీనామా చేశాడు. ఒకవైపు చంద్రబాబునాయుడేమో ప్రజలంతా ఉద్యమాలు చేయాలని పిలుపినిస్తున్నాడు. ఇదే సమయంలో ఉద్యమం గిద్యమం జాంతానై అని చెప్పేసి కూల్ గా ఎంఎల్సీగా రాజీనామా చేసేశాడు. అంటే చంద్రబాబు చెప్పిన ఉద్యమ బాధ్యత నుండి తప్పుకున్నట్లే అనుకోవాలి. ఎందుకంటే కడప జిల్లా నేతగా అందులోను పులివెందులలో ఉంటూ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తు ఉద్యమం అంటే ఇంకేమన్నా ఉందా ? అందుకనే రవి చాలా తెలివిగా తప్పించుకున్నాడు.
నిజానికి గవర్నర్ చర్యను నిరసిస్తు భారీ ఎత్తున ఉద్యమాలు చేయాలి, ఆందోళనలకు నాయకత్వం వహించాలి కానీ మరీ ఇలా సమయం చూసి తప్పించుకుంటారా ఎవరైనా ? చివరకు రవి రాజీనామా ఏమవుతుందన్నది వేరే సంగతి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బిటెక్ రవినే ఆదర్శంగా తీసుకుని మిగిలిన ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు కూడా ఇదే పని చేస్తే చంద్రబాబు పనేమవుతుంది ? అన్నదే ఇపుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే చాలామంది టిడిపిలో ఉండలేకపోతున్నారు. అధికారానికి అలవాటైన ప్రాణాలు ప్రతిపక్షంలో ఉండలేకపోతున్నాయట. చంద్రబాబుతో పడక+ఇతరత్రా కారణాలతో 23 మంది ఎంఎల్ఏల్లో ఇప్పటికే ముగ్గురు పార్టీకి దూరమైపోయిన విషయం అందరికీ తెలిసిందే.
పార్టీకి దూరమైన ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, కరణం బలరామ్, మద్దాలి గిరిధర్ ఇటు టిడిపిలో కంటిన్యు అవటం లేదు అటు వైసిపి తీర్ధమూ పుచ్చుకోలేదు. వ్యూహాత్మకంగా మధ్యేమార్గం అనుసరిస్తున్నారు. ఇదే పద్దతిలో ప్రయాణించటానికి ఇంకొందరు ఎంఎల్ఏలు కూడా రెడీ అవుతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ప్రకాశం జిల్లాలో మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు, వైజాగ్ జిల్లాలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తూర్పు గోదావరి జిల్లాలో ఓ ఎంఎల్ఏ పేరు బాగా ప్రచారంలో ఉంది. ఎంఎల్సీలు రాజీనామాలు చేస్తే వెంటనే ఆమోదం పొందే అవకాశం లేదు. అదే ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తే వెంటనే స్పీకడర్ తమ్మినేని సీతారామ్ వాటిని ఆమోదించే అవకాశం ఉంది. రాజీనామా చేసే ఉద్దేశ్యం ఉన్న ఎంఎల్ఏలు కూడా గవర్నర్ చర్యకు నిరసన అనే చెబుతారు. దాన్ని చంద్రబాబు కూడా కాదనలేడు.
ఇదే గనుక జరిగితే చంద్రబాబు పుట్టి ముణిగిపోయినట్లే అనుకోవాలి. అసలే ముగ్గురు ఎంఎల్ఏలు పార్టీకి దూరమవ్వటాన్ని తట్టుకోలేకున్నాడు పాపం. ఎందుకంటే చంద్రబాబుకు ఎదురయ్యే తక్షణ సమస్య ఏమిటంటే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోవటం. అసెంబ్లీలో టిడిపి బలం 17కి పడిపోతే చాలు చంద్రబాబు హోదా హూష్ కాకి. ఒకసారి అది పోయిందంటే ఇక తిరిగి సంపాదించుకునే అవకాశం లేదు. అందుకనే టిడిపి నుండి ఏ ఎంఎల్ఏ రాజీనామా చేయబోతున్నాడని మీడియాలో ప్రచారం జరిగినా చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అంటే ఇదే పద్దతిలో ఒకపుడు జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు శతవిధాల ప్రయత్నించాడు లేండి. కానీ ఎంత ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయాడు. అప్పుడు చంద్రబాబు చేయలేకపోయిన పనిని ఇపుడు జగన్ చాలా తేలిగ్గా చేసేయగలడు. టిడిపి ఎంఎల్ఏలకు వైసిపిలోకి గేట్లెత్తేస్తే చాలు చంద్రబాబు పని ఖేల్ ఖతం దుకాణ్ బంద్.