టీటీడీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీవాణి ట్రస్ట్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ఈ పథకం ద్వారా ఇప్పటికే 7 వేల మంది స్వామి వారి దర్శనం చేసుకోగా.. ఈ సేవలపై హర్షం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. మరోవైపు దళారి వ్యవస్థకు ఈ పథకం ద్వారానే చెక్‌ పెడుతోంది టీటీడీ.


కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుంటారు. స్వామి వారిని దర్శించుకోడానికి వివిధ రకాల క్యూ లైన్లు తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా స్వామి వారిని సమీపం నుంచి దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. మిగిలిన క్యూ లైన్లలోని భక్తులకు జయవిజయల గడప నుంచి మాత్రమే శ్రీవారిని దర్శించుకుంటున్నారు. దీంతో భక్తులు  వీఐపీ బ్రేక్ దర్శనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. సిఫార్సు లేఖలపై మాత్రమే బ్రేక్ దర్శనాలను కేటాయిస్తోంది టీటీడీ. భక్తుల సిఫార్సు లేఖల కోసం ప్రముఖులను ఆశ్రయించడం.. కుదరకపోతే దళారులను సంప్రదించడం సర్వసాధరణంగా మారిపోయింది. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలు దళారులకు కాసుల పంటగా మారింది. 500 రూపాయలు విలువ చేసే టిక్కెట్లను భక్తులు 5 వేల నుంచి 15 వేల వరకు వెచ్చించి కోనుగోలు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో టీటీడీ విజిలెన్స్ నిరంతరాయంగా తనీఖీలు చేస్తుండటంతో పెద్ద ఎత్తున దళారుల వ్యవహారం బయటకి వస్తోంది. 

 

బడుగు వర్గాల కాలనీల్లో ఆలయాలు నిర్మించడం.. అర్చకులకు కనీస వేతనాలు చెల్లించడం.... ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం నిధులు కేటాయింపు వంటి కార్యక్రమాల కోసం టీటీడీ గత ఏడాది శ్రీవాణి పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకానికి భక్తుల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ఈ ఏడాది అక్టోబర్ వరకు శ్రీవాణి పథకానికి భక్తులు సమర్పించిన విరాళాలు కోటి రూపాయలు మాత్రమే. దీంతో శ్రీవాణి పథకానికి స్వామి వారి దర్శనాన్ని అనుసంధానం చేస్తూ కొత్త విధానాన్ని అమలు చేసింది టీటీడీ. పది వేల రూపాయలు శ్రీవాణి పథకానికి విరాళంగా సమర్పించిన భక్తులకు.... ఎలాంటి సిఫార్సు లేఖతో పని లేకుండా వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది టీటీడీ. దీంతో ఈ పథకానికి భక్తుల నుంచి మంచి స్పందన వస్తోంది. 

 

అక్టోబరు 21న ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 7వేల 300 మందికి పైగానే భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మొదట ఆఫ్ లైన్ లో ప్రారంభించిన ఈ పథకం 10 రోజుల్లోనే ఆన్‌లైన్‌లోకి మారింది. శుక్రవారం 200మందికి.. మిగిలిన రోజుల్లో 500 మందికి టిక్కెట్లును విక్రయించాలని టీటీడి నిర్దేశించింది. దీంతో భక్తులు శ్రీవాణి ట్రస్ట్‌కి  విరాళాలు సమర్పించి.. స్వామివారి దర్శించుకుంటున్నారు. రానున్న వేసవి సెలవులకి నిర్దేశించిన కోటా టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. 

 

శ్రీవాణి ట్రస్ట్‌కి వస్తోన్న ఆదరణకి టీటీడీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవాణి పథకం కారణంగా స్వామివారి హుండి ఆదాయం తగ్గిందన్నది కేవలం అపోహ మాత్రమే అని తేలింది. గతేడాదితో పోలిస్తే.. అక్టోబర్, నవంబర్ నెలల్లో హుండి ఆదాయం భారీగా పెరిగింది. దీంతో శ్రీవాణి పథకం స్వామివారి కానుకలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇక దళారి వ్యవస్థకు శ్రీవాణి ట్రస్ట్ పరోక్షంగా చెక్ పెట్టింది. అధిక మొత్తంలో నగదును దళారులకు చెల్లించే భక్తులు.. ఇప్పుడు నేరుగా స్వామివారికే విరాళంగా సమర్పించి వీఐపీ బ్రేక్ దర్శనాన్ని పొందుతున్నారు. మొత్తంగా శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ఆనందాన్ని.. దళారులకు దుఃఖాన్ని.. టీటీడీకి సిరుల్ని మిగుల్చుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: