
హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న లఖింపూర్‌లో పర్యటించేందుకు అనుమతించకుండా విపక్ష నేతలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడంపై శివసేన పార్టీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది. విపక్ష నాయకులను లఖింపూర్ చేరకుండా జిల్లా సరిహద్దులను మూసివేయడాన్ని ఆ పార్టీ పత్రిక 'సామ్నా' సంపాదకీయం ప్రశ్నించింది. లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనాన్ని కూడా సామ్నా ప్రశ్నించింది.
''యోగి ప్రభుత్వం లఖింపూర్ సరిహద్దులను మూయడంతోపాటు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని ఘటనా స్థలికి వెళ్తుండగా అడ్డుకుని 28 గంటలపాటు నిర్బంధించారు. ఎంపీ హుడాపై కూడా అనుచితంగా ప్రవర్తించడంతోపాటు అఖిలేష్ యాదవ్‌ను గృహనిర్బంధం చేశారు'' అని సామ్నా తన సంపాదకీయంలో పేర్కొంది. లఖింపూర్ సరిహద్దులను మూసేసిన తరహాలోనే లద్దాఖ్‌లో ఇండో-చైనా సరిహద్దులను మూసివేసి ఉంటే చైనా సైనికుల చొరబాటు ఉండేది కాదంటూ మోడీ ప్రభుత్వానికి చురకలు వేసింది. లఖింపూర్ ఘటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై సామ్నా సంపాదకీయం తీవ్రస్థాయిలో విమర్శించింది.