ప‌శ్చిమ‌గోదావ‌రి  జిల్లా ద్వారకా తిరుమలలో దారుణం చోటు చేసుకున్న‌ది.  చిన్న వెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు. దెబ్బలు తాళ‌లేక‌ మహిళా యాచకులు గ‌ట్టిగా కేకలు పెట్టారు. భక్తులకు అసౌకర్యం కలిగిస్తున్నారనే నెపంతో మహిళా యాచకులను భద్రతా సిబ్బంది మోకాళ్లపై నిలబెట్టి, కర్రలతో చితకబాదారు. ద్వారకా తిరుమలలోని శివాలయం వ‌ద్ద‌ యాచకులపై ఈ దాడి జరిగిన‌ది. భక్తులు ఆలయానికి  వ‌స్తుంటే వారిని ఇబ్బంది కలిగించే రీతిలో భిక్షాటన చేస్తున్నారని ఆరోపిస్తూ అక్కడ ఉన్న యాచకులందరినీ కర్రతో బాదుతూ సెక్యూరిటీ సిబ్బంది ఓ దగ్గరకు తీసుకొచ్చారు.

మరోవైపు తాము వెళ్లిపోతాం అని చెప్పినా కొంచెం కూడా  కనికరం చూపకుండా సెక్యూరిటీ సిబ్బంది కొట్టారని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతోనే వాళ్లను మందలించామని దేవస్థానం భద్రతా విభాగం అధికారి సూర్యనారాయణ పేర్కొన్నారు. మోకాళ్లపై యాచకులను నిలబెట్టినందుకు తాము భద్రతా సిబ్బందిని మందలించామని వెల్ల‌డించారు.  భక్తులు వస్తున్న సమయంలో భిక్షాటన చేస్తూ అడ్డుపడుతున్నారని..వారికి గతంలోనే కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని గుర్తు చేసారు. స్వీప‌ర్లుగా ఉద్యోగం ఇస్తాం అని చెప్పినా కానీ వారు యాచ‌కులుగానే ఉంటామ‌ని నిరాక‌రించారు. గ‌తంలోనే యాచ‌కులు కొంద‌రి భ‌క్తుల వ‌ద్ద ప‌రుసుల‌ను చోరీ చేశార‌ని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: