
అయితే నిర్ణీత గడువు తేదీలోపు చెల్లించని క్రెడిట్ కార్డ్ బకాయిల మీద క్రెడిట్ కార్డ్ వినియోగాన్ని బట్టి 23 నుంచి 49 శాతం వరకు వడ్డీ కింద కంపెనీలు చార్జ్ చేస్తుంటాయి. దీంతో పాటు తిరిగి చెల్లింపుల్లో విఫలమైతే ఆలస్య రుసుము కింద రూ.1,300 వరకు కంపెనీలు వసూలు చేస్తుంటాయి. ఇలాంటి ఇబ్బందులను నివారించేందుకు.. బిల్లులను సకాలంలో చెల్లించలేని పరిస్థితుల్లో ఉంటే, కొంత భాగాన్ని ఈఎంఐగా మార్చుకోవడం ఒక మార్గం. క్రెడిట్ కార్డ్ తిరిగి చెల్లింపుల కాల వ్యవధి సాధారణంగా 3 నుంచి 60 నెలల వరకు ఉంటుంది. దీనిపై వార్షిక వడ్డీ రేటు 11–24 శాతంగా ఉంటుంది. అది కూడా క్రెడిట్ కార్డ్ వినియోగం, జారీ చేసిన కంపెనీని బట్టి మారుతుంటుంది.
అంతేకాదు.. కొన్ని సార్లు ఎటువంటి వడ్డీ లేకుండా ఈఎంఐ చెల్లించండి’ అనే ప్రకటనలు చూసే ఉంటారు. మర్చంట్ ఈఎంఐ ఆప్షన్‌లో ఒక రకమే నో కాస్ట్ ఈఎంఐ స్కీమ్. ఇందులో ఈఎంఐ మీద వడ్డీని వర్తకులు లేదా తయారీదారులు భరిస్తారు. దీంతో ఉత్పత్తి లేదా సేవల ధరను ఈఎంఐల రూపంలో అనుమతించిన కాల వ్యవధి మేరకు కొనుగోలుదారులు చెల్లించాల్సి ఉంటుంది. ఈఎంఐ మీద వడ్డీ భారం పడకపోయినా.. ఆ వడ్డీపై 18% జీఎస్‌టీని క్రెడిట్ కార్డ్ వినియోగదారులే భరించాల్సి ఉంటుంది.
ఇక మంచి సిబిల్ స్కోర్, చెల్లింపుల చరిత్ర ఉన్న వారు క్రెడిట్ కార్డులపై రుణాలనూ తీసుకోవచ్చు. కాకపోతే తీసుకున్న రుణం మేరకు క్రెడిట్ కార్డ్ లిమిట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. తిరిగి చెల్లించిన తర్వాత మళ్లీ ఆ పరిమితిని అందుబాటులోకి తెస్తారు. రుణాల రీపేమెంట్ కాల వ్యవధి 6 నుంచి 60 నెలలుగా ఉంటుంది.