గతేడాది నుంచి కరోనా వైరస్ ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. కరోనా వచ్చి.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా మరణాల సంఖ్య తగ్గడం లేదు. కరోనా సోకిందని ముందుగానే భయపడుతూ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికీ కొందరికీ కరోనా భయం వీడటం లేదు. మలేషియాలో నివాసముంటున్న ఓ తమిళ కుటుంబానికి కరోనా సోకింది. దీంతో భయాందోళనకు గురై తల్లి, కుమార్తె టెర్రస్‌ పై నుంచి దూకి నాలుగు రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్నారు. ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ ఇటీవలే తండ్రి కూడా మృత్యువాత పడ్డారు.

కడలూరు జిల్లా దిట్టకుడికి చెందిన రవిరాజా (40) కంప్యూటర్‌ ఇంజినీర్‌. 12 ఏళ్లుగా మలేషియాలో భార్య సత్య (37), కుమార్తె గుహదరాణి(5)తో కలిసి నివాసముంటున్నారు. అయితే వారంరోజుల కిందట ఇంట్లో అందరికీ కరోనా వైరస్ సోకింది. ఈ క్రమంలో రవిరాజా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రిలో జాయిన్ చేయించారు. సత్య, గుహదమణి హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో భయాందోళనకు గురైన సత్య, గుహదమణిని తీసుకుని ఇంటి టెర్రస్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

అయితే ఈ విషయం రవిరాజాకు తెలిసింది. భార్యాపిల్లలు ఆత్మహత్యకు పాల్పడటంతో అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో నిన్నటి సాయంత్రం రవిరాజా కూడా ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు రవిరాజా బంధువులు మృతదేహాలు ఇవ్వాలని మలేషియా ప్రభుత్వాన్ని కోరారు. దీంతో అక్కడి ప్రభుత్వం మృతదేహాలు పంపేందుకు తిరస్కరించింది. భారత ప్రభుత్వం అనుమతిస్తే వారి అస్థికలు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ మేరకు భారత రాయబార కార్యాలయం చర్చలు జరిపి అస్తికలు సొంత గ్రామానికి వచ్చేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, కరోనా సోకిందని ప్రాణాలు కోల్పోకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని, వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కరోనాను పూర్తి స్థాయిలో నిర్మూలించగలమని పలువురు పేర్కొంటున్నారు. అన్నింటికీ ఆత్మహత్యే పరిష్కారం కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: