ఏపీ సీఎం జగన్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు చుక్కలు చూపిస్తున్నారా.. అంటే అవుననే చెప్పాలి.. గతంలో ఉద్యోగుల సమ్మె సమయంలోనూ కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు ఇప్పుడు సీపీఎస్‌ రద్దు కోసం పోరాటం ఉధృతం చేశారు. సీపీఎస్‌ రద్దు కోరుతూ ఇవాళ సీఎంవో ముట్టడికి యూటీఎఫ్‌ పిలుపు ఇచ్చింది. అయితే.. ఈ చలో సీఎంవో భగ్నం చేసేందుకు పోలీసుల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. శనివారం రాత్రి నుంచే పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.


యూటీఎఫ్‌ సభకు వెళ్లొద్దంటూ ఉపాధ్యాయ నేతలకు పోలీసులు ముందుగానే నోటీసులు ఇచ్చారు. అంతే కాదు.. యూటీఎఫ్‌ నేతలను స్టేషన్‌కు పిలిపించి సభకు వెళ్లకూడదంటూ సంతకాలు తీసుకున్నారు. ఎక్కడికక్కడ యూటీఎఫ్‌ నేతలు, ఉపాధ్యాయులను గృహ నిర్బంధం చేస్తున్నారు. అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను ముందస్తుగానే అరెస్ట్‌ చేశారు. ఉపాధ్యాయులు, యూటీఎఫ్‌ నేతల ఇళ్లపై నిఘా ఉంచారు. రైళ్లు, వాహనాలను తనిఖీ చేసి విజయవాడ వస్తున్న ఉపాధ్యాయులను అరెస్ట్‌ చేస్తున్నారు.


విజయవాడ వెళ్తున్న నేతలను వివిధ  స్టేషన్లకు పోలీసులు తరలించారు. ముందు జాగ్రత్తగా విజయవాడలో హోటళ్లు, లాడ్జిలు, రైల్వేస్టేషన్‌, బస్టాండ్లలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అలాగే సీఎంవో వద్ద ముందు  జాగ్రత్తగా కంచెలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 800 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు  చేశారు. ప్రకాశం బ్యారేజీ వారధి వద్ద కూడా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎంఓకు వచ్చే అన్ని మార్గాల్లో సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు.


గతంలో పీఆర్సీ ఉద్యమం సమయంలో యూటీఎఫ్‌ టీచర్ల చలో విజయవాడతోనే ఉద్యమానికి ఊపు వచ్చింది. అప్పటి వరకూ వారిని పట్టించుకోని ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చింది. అలాగే ఇప్పుడు టీచర్లు మరోసారి తమ సత్తా చూపిస్తామంటున్నారు. ఎన్ని నిర్బంధాలు పెట్టినా చలో సీఎంఓ విజయవంతం చేస్తామంటున్నారు. మరి ఈసారి టీచర్లు ఏస్థాయిలో సత్తా చాటతారో..  చూడాలి.. ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి: