వీ6 ఛానల్ ఏముహూర్తాన తీన్మార్ వార్తలు కాన్సెప్టును ప్రారంభించిందో కానీ.. అది ఇప్పటికీ పటాసులా పేలుతూనే ఉంది. వీ6 న్యూస్ ఛానల్ అసలు జనంలోకి వెళ్లిందే ఈ తీన్మార్ వార్తలు కాన్సెప్టుతోటి. వీ6 అంటే తెలంగాణ ఫోకస్ గా ఉండే ఛానల్. జనంలోకి వెళ్లాలంటే జనం భాషే వాడాలని ఆలోచించింది. తీన్మార్ వార్తలు ప్లాన్ చేసింది. ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్టే అయ్యింది.

 

 

తీన్మార్ వార్తలు ప్రోగ్రామ్ కారణంగానే వీ6 న్యూస్ ఛానల్ తెలంగాణ జనంలోకి వెళ్లిందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు.. దీనికి తోడు తెలంగాణ భాష,యాస, సంస్కృతికి పెద్ద పీట వేయడంలో తెలంగాణ బ్రాండ్ ను తన సొంతం చేసుకుంది. జనం కూడా దాన్ని తమ సొంత ఛానల్ అనుకున్నారు. ఏదైనా ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ హిట్ అయ్యిందంటే.. దాన్ని కాపీ కొడుతూ అనేక ఛానళ్లు అదే ప్రయత్నం ప్రారంభిస్తాయి.

 

 

తీన్మార్ వార్తల విషయంలోనూ అదే జరిగింది. తీన్మార్ వార్తలు సూపర్ హిట్టయ్యాక హెచ్ఎంటీవీ జోర్దార్ వార్తలు ప్రారంభించింది. టీ న్యూస్ కూడా ధూంధాం వార్తలు అంటూ హడావిడి చేస్తోంది. చివరికి టాప్ ఛానల్ టీవీ9 కూడా ఇదే ప్రయోగం చేసిందంటే ఈ తీన్మార్ ప్రయోగం ఎంత సక్సస్ అయ్యిందో ఊహించుకోవచ్చు. అయితే ఈ ఫార్మాట్‌ లో ముందుగా అలరించిన తీన్మార్ మల్లన్న, రాములమ్మ.. ఆ తర్వాత వచ్చి అలరించిన బిత్తిరి సత్తి, సాఫిత్రి వంటి వారికి ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది.

 

 

ఇప్పుడు తీన్మార్ మల్లన్నగా ఫేమస్ అయిన చింతపండు నవీన్ కుమార్.. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి కాంగ్రెస్ తరపున ఎన్నికల్లోనూ పోటీ చేసినా అదృష్టం కలసి రాలేదు. మళ్లీ అలవాటైన పని అయినే మల్లన్న పాత్రలో టీవీ5 తెరపై మాస్ మల్లన్నగా ప్రత్యక్షమయ్యాడు. టీవీ5లో రాత్రి ఎనిమిదిన్నర ప్రైమ్ టైమ్ న్యూస్ లో సందడి చేస్తున్నాడు. ఈ ప్రోగ్రామ్ టీవీ5లోనూ సూపర్ సక్సస్ అవుతోంది. ఈ ఛానల్ టాప్ 11 ప్లేసుల్లో 9 ప్లేసులు సొంతం చేసుకుని అదరహో అనిపిస్తోంది. గ్రేట్ కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: