ఏ నాయకుడైనా జనంలో మంచి పేరు కోరుకుంటాడు. అందుకే జనం ఏం కోరుకుంటారో అవి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ప్రజలను అర్థం చేసుకోవడంలో ఒక్కో నాయకుడిది ఒక్కో పంథా. కొందరు అభివృద్ధికి పెద్ద పీట వేస్తారు.. ఇంకొందరు సంక్షేమం బాగా చేయాలనుకుంటారు. మరికొందరు రెండింటినీ మేళవించి ముందుకు పోతుంటారు. అయితే.. అల్టిమేట్‌గా ఎవరి పాలన ఎలాంటింది అన్న విషయాన్ని జనం తేలుస్తారు. ఐదేళ్ల కోసారి తమ తీర్పు ఏంటో చెబుతుంటారు.


తెలంగాణలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఇంటింటికీ తాగునీరు.. రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పాపులర్ పథకాలు ప్రవేశ పెట్టారు. అవి మంచి సక్సస్ అయ్యాయి కూడా. అలాగే.. ఏపీలో జగన్ పూర్తిగా సంక్షేమంపైనే దృష్టి పెట్టారు. తాను సీఎం అయితే ఏం చేస్తానని పాదయాత్రలో చెప్పారో ఆ హామీలనే తన ప్రథమ కర్తవ్యంగా జగన్ భావిస్తున్నారు. అందుకే తన నవరత్నాల పథకాల అమలుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగిలిన అభివృద్ధి కార్యక్రమాలు పట్టించుకోవడం లేదన్నది జగన్ పై ఉన్న ఫిర్యాదు.


అయితే జగన్ సర్కారు ప్రవేశపెట్టిన అమ్మఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. అయితే.. అటు కేసీఆర్ కానీ.. ఇటు జగన్ కానీ.. తమకు మంచి పేరు తెచ్చిన తమ మానస పుత్రికల వంటి పథకాలను దేశమంతా అమలు చేయాలని కోరుకుంటున్నారు. అలా అమలైతే.. తమ పథకాన్ని దేశం మొత్తం అమలు చేస్తున్నారని.. అంటే తాము దేశానికి మార్గదర్శకత్వం వహిస్తున్నామని చెప్పుకునేందుకు అవకాశం ఉంటుందని వారి ఉద్దేశ్యం కాబోలు.


గతంలో కేసీఆర్ దేశమంతా రైతు బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు. థర్డ్ ఫ్రంట్‌ ఆశల్లో ఉన్న రోజుల్లో తరచూ కేసీఆర్ నోట ఇలాంటి మాటలు వచ్చేవి.. ఇప్పుడు జగన్ పార్టీ కూడా అమ్మ ఒడి వంటి పథకాలు దేశమంతా అమలు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు వైసీపీ ఓ ప్రైవేటు బిల్లు కూడా పార్లమెంటులో పెట్టింది. మొత్తానికి కేసీఆర్, జగన్ జాతీయ గుర్తింపు కోసం తపిస్తున్నారేమో అనిపిస్తోంది ఈ జోరు చూస్తుంటే. మీరేమంటారు..?  

మరింత సమాచారం తెలుసుకోండి: