ఏపీలో పీఆర్సీ సమస్య మళ్లీ మొదటికి వచ్చింది.  ఈ పీఆర్సీ ఆమోదంపై ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు అనేక రోజుల తరబడి చర్చలు జరిపిన తర్వాత ఓ కొలిక్కి వచ్చినట్టు కనిపించిన ఈ సమస్య.. మళ్లీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలతో మొదటికి వచ్చేసింది. హెచ్‌ఆర్‌ఏలు, ఇతర అలవెన్సుల విషయంలో ఇచ్చిన హామీలు నిలపెట్టుకోలేదని ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చెబుతున్నాయి. నిన్నా మొన్నా కాస్త గళం విప్పిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు మరింతగా స్వరం పెంచేశారు. సమ్మె నోటీసు ఇస్తామని.. సమ్మెకు దిగితీరతామని చెబుతున్నారు.


అయితే.. ఇక్కడ ఓ విషయం గమనించాలి.. ఈ పీఆర్సీ అంశం కొన్ని నెలలుగా సీఎం వద్ద నలుగుతూనే ఉంది. ఈ అంశంపై ఉద్యోగులు, ప్రభుత్వం.. ఈ ఇద్దరికీ మధ్య వారధిగా  ప్రభుత్వ సలహాదారు, వైసీపీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి  పని చేశారు. ఆయనే అనేక సార్లు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం తరపున చర్చలు జరిపారు. ఆయనే ఉద్యోగ సంఘాల నేతలను సీఎం దగ్గరికు తీసుకెళ్లారు. చర్చల ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావడంలో విజయవంతం అయ్యారు.


కానీ.. సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కృషి అంతా ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. విచిత్రం ఏంటంటే.. రెండు, మూడు రోజులుగా ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య మళ్లీ సమావేశాలు జరుగుతూ ఉంటే.. ఇరు పక్షాలకూ సంధి కుదర్చిన సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. తాను పరిష్కరించిన సమస్య.. మళ్లీ మొదటికి వస్తే.. ఆయన చొరవ లేకుండా సమస్య పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.


మరి ఇంతకీ సజ్జల ఏమైనట్టు.. ఆయన ఎందుకు ఈ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించడం లేదు. ఒకవేళ ప్రయత్నించినా సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదా.. ఇవీ ఇప్పుడు సమాధానం రావాల్సిన ప్రశ్నలు.


మరింత సమాచారం తెలుసుకోండి: