అవును.. నిజమే.. ఈ కొత్త జిల్లాల నోటిఫికేషన్‌ను ఉన్నపళంగానే తెచ్చారు. చివరకు మంత్రుల సమ్మతి కూడా ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాంటే.. ఆగమేఘాల మీద తెచ్చినట్టే.. జిల్లాల ఏర్పాటు చాలా సున్నిత ప్రక్రియ.. ఎప్పటి నుంచో కొన్ని చారిత్రక డిమాండ్లు ఉంటాయి.. కొన్ని స్థానిక పరిస్థితులను బాగా ప్రభావితం చేస్తాయి.. దీనిపై అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే ఇంకా బావుండేది.. కానీ.. జగన్ సర్కారు మాత్రం అనూహ్యంగా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇవిగో కొత్త జిల్లాలు అంటూ ఆవిష్కరించింది.
ఇక ఇప్పుడు కొత్త జిల్లాలపై అభ్యంతరాలు ఉన్నవారి ఆందోళనలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. జగన్ వ్యతిరేక మీడియా ఇప్పుడు ఈ ఆందోళనలపై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. దీంతో ఉద్యోగులకు అన్యాయం అంశం క్రమంగా డైవర్ట్ అయిపోతోంది. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. తమ ఉద్యమాన్ని పక్కదోవ పట్టించేందుకే ఇప్పుడు జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారని అంటున్నారు.
జగన్ వేసిన ఈ జిల్లా ఎత్తుగడతో జగన్ వ్యతిరేక మీడియా కూడా చిత్తయిందేమో అనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగుల ఆందోళనలతో మీడియాను హోరెత్తించిన వారు.. ఇప్పుడు కొత్త జిల్లాల ఆందోళనలకు ప్రయారిటీ ఇస్తున్నారు. అంటే కొత్త జిల్లాల ఏర్పాటు పావును కదపడం ద్వారా రాజకీయం చదరంగంలో జగన్ విజయం సాధించారన్నమాటేగా..!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి