రాజ‌కీయంగా ఉత్త‌ర ద‌క్షిణ ధ్రువాలుగా ఉన్న ఏపీ అధికార పార్టీ వైసీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో రాజ‌కీయ వైరం కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఈ వివాదాలు.. విద్వేషాలు మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని మేధావులు చెబుతున్నారు. ఎందుకంటే.. నేటి (సోమ‌వారం) ప్రారంభం అవుతున్న ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌భుత్వం ఒక విధానాన్ని స్ప‌ష్టం చేసింది. ఈ స‌మావేశాల‌ను ఎన్నాళ్ల‌యినా నిర్వ‌హించేందుకు స‌ర్కారు సంసిద్ధంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

దీనికి కార‌ణం.. ఇటీవ‌ల రాజ‌ధాని అమ‌రావ‌తిపై.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిలో రాజ‌ధానిపై చ‌ట్టం చేసేఅదికారం.. ప్ర‌భుత్వానికి లేద‌ని తేల్చి చెప్పింది. దీంతో అస‌లు చ‌ట్టం చేసేందుకు మాత్ర‌మే క‌దా శాస‌న స‌భ‌లు ఉన్న‌ది.. చ‌ట్టాలు చేయ‌ద్ద‌ని ఎలా చెబుతార‌ని.. వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టికే ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం కూడా ఈ విష‌యంపైనే సీరియ‌స్‌గా డిస్క‌స్ చేసి.. విష‌యాన్ని తేల్చి పారేయాల‌ని నిర్ణ‌యించు కుంది. ఈ క్ర‌మంలో స‌భ‌లో శాస‌న‌-న్యాయ‌వ్య‌వ‌స్థ‌ల‌కు మ‌ధ్య ఉన్న వివాదాలు, విష‌యాలు, రాజ్యాంగం ఏం చెప్పింది?  ఏం చేయాలి? అనే కీల‌క విష‌యాల‌పై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం స‌మాయ‌త్త‌మైంది.

అయితే.. ఇదే విష‌యంపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. అమ‌రావ‌తిపై తీర్పును టీడీపీ స్వాగ‌తించింది. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం చేప‌ట్టే.. శాస‌న‌-న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌పై చ‌ర్చ‌కు టీడీపీ స‌హ‌క‌రించే అవ‌కాశం లేదు. ఈ క్ర‌మంలొ చంద్ర‌బాబు మిన‌హా.. మిగిలిన టీడీపీ నాయ‌కులు స‌భ‌కు హాజ‌రై.. ఈ చ‌ర్చ‌కు అడుగ‌డుగునా అడ్డు ప‌డే అవ‌కాశం ఉంద‌ని మేధావులు చెబుతున్నారు. ఇదే జ‌రిగితే.. ప్ర‌భుత్వంకూడా గ‌ట్టిగానే బ‌దులివ్వ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

ఇప్ప‌టికే హైకోర్టు తీర్పుపై తీవ్ర అంత‌ర్మ‌థ‌నంలో ఉన్న ప్ర‌భుత్వం టీడీపీ స‌భ్యులు క‌నుక ఈ చ‌ర్చ‌కు అడ్డు త‌గిలితే.. ఏడాది నుంచి పూర్తిగా కూడా వారిని స‌భ నుంచి బ‌హిష్క‌రించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. వాస్త‌వానికి టీడీపీ కూడా ఇదే కోరుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. మొత్తం స‌భ్యుల‌పై స‌భ వేటు వేస్తే.. దీనిని ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లి.. త‌మ‌కు ల‌బ్ధి క‌లిగేలా.. ప్ర‌చారం చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి వైసీపీ ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుందా లేదా?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: