కేసీఆర్ మరో రాజకీయ సంచలన ప్రకటన చేశారు.  దళిత బంధు తరహాలో గిరిజన బంధు పథకం అమలు చేస్తానని ప్రకటించారు. గిరిజన బంధు పథకాన్ని తన చేతుల మీదుగా ప్రారంభిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ అంటున్నారు. భూములు లేని గిరిజనులను గుర్తించి... అలాంటి వారికి ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ అంటున్నారు. వారికి దళిత బంధు తరహాలోనే గిరిజన బంధు అమలు చేస్తామంటున్నారు. ఈ పథకం  ద్వారా భూమి లేని గిరిజనులకు రూ.10 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామంటున్నారు. అంతే కాదు.. భూములు లేని గిరిజనులకు పోడు భూములు కూడా పంచుతామంటున్నారు.


అయితే.. కేసీఆర్ చేసిన ఈ తాజా గిరిజన బంధు ప్రకటనపై ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. సంక్షేమంలో తనంత చేసిన వారు లేరు అనిపించుకోవాలన్న సీఎం కేసీఆర్ మంచిదే.. అన్ని వర్గాలకు సంక్షేమం అందడం అవసరమే. అయితే.. అమలు చేసే కార్యక్రమాలు ఎన్నికల లబ్ది కోసం కాకుండా కాస్త కసరత్తు చేసి.. రూపొందిస్తే బావుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేసీఆర్ సర్కారు ప్రకటించిన దళిత బంధు పథకం పై అనేక విమర్శలు ఉన్నాయి.


గతంలో కేసీఆర్ ఘనంగా దళిత బంధు పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రతి ఎస్సీ కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామన్నారు. సంతోషమే.. కానీ.. ఈ పథకానికి నియోజక వర్గానికి వెయ్యి కుటుంబాలను మాత్రమే ఎంపిక చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే.. ఒక నియోజక వర్గంలో కేవలం వెయ్యి మాత్రమే దళిత కుటుంబాలు ఉంటాయా.. వెయ్యి దళిత కుటుంబాలకు మాత్రమే దళిత బంధు ఇస్తే.. మిగిలిన కుటుంబాల సంగతేంటి.. వారు అభివృద్ధి చెందవద్దా అన్న వాదనలు ఉన్నాయి.


ఆ వెయ్యి కుటుంబాలు కూడా గులాబీ కార్యకర్తలై ఉంటారని ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. లక్షల సంఖ్యలో ఉన్న కుటుంబాలకు కేవలం వేలల్లో సాయం చేసి.. ఘనంగా చేశామని చెప్పుకుంటే అది నిజమైన సంక్షేమం అవుతుందా అన్న ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇక ఇప్పుడు ప్రకటించిన ఈ గిరిజన బంధు ఇంకెలా అమలవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: