రామ్ మనోహర్ లోహియా ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకొంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య భావనతో ముందుకు వెళ్తారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. రామ్ మనోహర్ లోహియా జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ అంజలి ఘటించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలపై, పోరాట పంథాపై లోహియా ఆలోచనల ప్రభావం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఎలుగెత్తు... ఎదిరించు.. ఎన్నుకో... అన్న జనసేన విధానానికి రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలే స్ఫూర్తని పవన్ కళ్యాణ్ చెప్పారు.


దేశంలో కుల సమస్య, శాస్త్రీయ అవగాహనతో పాటు వాటి పుట్టుపూర్వోత్తరాలు గురించి సాధికారికంగా మాట్లాడటంతో పాటు... సమసమాజ స్థాపన కోసం లోహియా తపించారని పవన్ కళ్యాణ్  అన్నారు. రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారని... అందులో నుంచే జనసేన పార్టీ కులాలను కలిపే ఆలోచనా విధానం అనే  సిద్ధాంతాన్ని తీసుకుందని.. లోహియా చెప్పినట్లు కులాల మధ్య అంతరాలు తగ్గించడం కోసం కృషి చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు.


ప్రస్తుత సమాజం, ముఖ్యంగా యువత లోహియా సిద్ధాంతాలు అర్థం చేసుకొంటే కులాల సంక్లిష్టత నుంచి బయటపడవచ్చని పవన్ కళ్యాణ్  అన్నారు. భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ సంస్మరణ దినం సందర్భంగా వారికి పవన్ కళ్యాణ్ అంజలి ఘటించారు. దేశం కోసం చనిపోయేవారు ఎల్లకాలం బతికే ఉంటారని, ఈ ముగ్గురు వీరుల విషయంలో ఈ పలుకులు అక్షర సత్యాలని.. దేశ మాత దాస్యశృంఖలాలను తెంచడానికి ఈ ముగ్గురు వీరులు లాహోర్ జైలులో ఉరి కంబాన్ని ముద్దాడారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు.



పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే వారు రగిలించిన స్వతంత్ర కాంక్ష, విప్లవాగ్ని... ఈ దేశం నుంచి పరాయి పాలకులు దేశం నుంచి పారిపోయేంత వరకు జ్వలించాయని పవన్ కళ్యాణ్  అన్నారు. ఈ మహానీయులను నిత్యం స్మరించుకోవటంతో పాటు... దేశవ్యాప్తంగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్  ఆకాంక్షించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: