ఈ భూమిపై ఎంతో మంది పుడుతుంటారు.. గిట్టుతుంటారు.. కానీ కొంత మంది మాత్రమే ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచి పోతుంటారు. ఇక  ఆధ్యాత్మిక, మానవసేవా రంగాలలో విశ్వవ్యాప్తంగా కొనియాడబడుతున్న గురువు పరమపూజ్య శ్రీశ్రీ రవిశంకర్. నేడు సర్వత్రా లోపిస్తున్న మానవతావిలువలను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా హింస, మానసికఒత్తిడి లేని సమాజాన్ని సృష్టించాలన్న శ్రీశ్రీ దృక్పథం ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమందిని ఆకర్షించి, ప్రపంచ అభ్యున్నతికి పనిచేసే దిశగా వారి బాధ్యతను మరింత పెంచింది. బాల్యం నుండే లోతైన ధ్యానం, ఆధ్యాత్మిక చింతన.  నాలుగేళ్ళ వయసులోనే భగవద్గీత పూర్తిగా పఠించి ఉపాధ్యాయులను ఆశ్చర్య చకితులను చేశారు. మహాత్మాగాంధీకి అత్యంత సన్నిహితుడైన పండిట్ సుధాకర్ చతుర్వేది వద్ద మొదటి పాఠాలు.   

 

17 సంవత్సరాల నాటికి వేదసాహిత్యం సమగ్ర అధ్యయనం, దానితోబాటే ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో పట్టా పుచ్చుకున్న మహా జ్ఞాని. 1981వ సంవత్సరంలో శ్రీశ్రీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను స్థాపించారు. ఇది విద్య, మానవసేవా రంగాలలో 152కు దేశాలలో పనిచేస్తున్న అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ. ఐక్యరాజ్య సమితిలోని ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ లో ప్రత్యేక సలహా, సంప్రదింపుల సంస్థగా గుర్తింపబడింది. వ్యక్తులలో, సమాజంలో, దేశాలమధ్యా తలెత్తే సంఘర్షణల నివారణకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనటం, వాటిని  ఆచరింప జేయటం లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తున్నది. శ్వాసక్రియను అదుపులోకి తేవటం ద్వారా మానవుని భౌతిక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించి, భావావేశాన్ని అదుపుచేసి, తద్వారా సామాజిక ప్రశాంతతకు ఇది తోడ్పడుతుంది. 

 

శ్రీశ్రీ రవిశంకర్ ను అనేక అవార్డులు వరించాయి. వాటిలో చెప్పుకోదగ్గవి ఆర్డర్ ఆఫ్ పోల్ స్టార్ (మంగోలియా దేశపు అత్యున్నత అవార్డు), రష్యా ప్రభుత్వంచే ది పీటర్ ది గ్రేట్ అవార్డ్, సంత్ శ్రీ ధ్యానేశ్వర్ ప్రపంచ శాంతి బహుమతి (భారతదేశం), గ్లోబల్ హ్యుమానిటేరియన్ అవార్డ్ (అమెరికా) మొదలైనవి. ఐక్యరాజ్యసమితిచే  2000వ సంవత్సరంలో జరుపబడిన మిలీనియం ప్రపంచ శాంతి శిఖరాగ్రసభ, 2001, 2003 సంవత్సరాలలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభలలోనూ, అనేక దేశాల పార్లమెంటుసభలలోనూ శ్రీశ్రీ ప్రసంగించారు.  భారతదేశప్రజలను ఆథ్యాత్మికంగా సమైక్యం చేయగలిగిన వ్యక్తి  శ్రీశ్రీ తప్ప మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: